నిత్యావసరాల పంపిణీపై నివేదికివ్వండి

7 Apr, 2020 03:24 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం

వైద్య రక్షణ పరికరాలు, క్వారంటైన్‌ సౌకర్యాలపై కూడా నివేదిక కోరిన కోర్టు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వైద్యులు, సిబ్బందికి రక్షణ పరికరాలు–మందులు, ప్రజలకు ఆహారం–నిత్యావసర వస్తువులు, క్వారంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న సౌకర్యాలు తదితరాలపై నివేదిక అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 9వ తేదీ గురువారం నాటికి మధ్యంతర నివేదిక ఇవ్వాలని, పూర్తి నివేదికను ఈ నెల 15లోగా అందజేయాలని ఆదేశిం చింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఇంకా ఎంత మేరకు అవసరం ఉంటాయి, వాటికోసం తీసుకున్న చర్యల గురించి నివేదికలో వివరించాలని కోరింది. నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇక ముందు అవసరమైన సరుకుల గురించి కూడా మధ్యంతర నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ..
విదేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్స్‌లో సౌకర్యాలు కల్పించాలని, వైద్యం అందిస్తున్న సిబ్బందికి వైద్య రక్షణ పరికరాలు అందజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజాహి త వ్యాజ్యాన్ని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యా యవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రాణాలను ఫణం గా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వారికి వైద్య రక్షణ పరికరాలు అందజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎన్‌ 95 మాస్క్‌ లు, గ్లౌజ్‌లు, శానిటైజ ర్లు, వ్యక్తిగత వైద్య రక్షణ పరికరాలు తగినంతగా లేవని, వీటి తయారీకి లేదా దిగుమతికి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని సూచించారు.

లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వీధి పిల్లలు, అనాథలు, వసతి గృహాల్లోని వారు, తెల్లరేషన్‌ కార్డు లేని వారు, వలస కార్మికులకు వారి వద్దకే నిత్యావసర వస్తువులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను కఠినంగా అమలు చేస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు. కరోనాకు సంబంధించిన ఇతర కేసులు, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం వద్ద ఉన్న కేసుల్ని కూడా ఒకే ధర్మాసనం విచారిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఏజీ కోరారు. దీంతో అన్ని కేసుల్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనమే విచారిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అన్ని కేసుల్ని తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని వార్తలు