కోవిడ్‌ నియంత్రణపై ప్రణాళికలు ఏమిటి?

5 Mar, 2020 02:13 IST|Sakshi

నివారణ చర్యలు ఏం తీసుకున్నారు: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ (కరోనా) వైరస్‌ కోరలు చాచిన తరుణంలో పిల్లలు, పెద్దలు ఆనందంగా జరుపుకునే హోలీ వేడుకలను నిషేధించాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కోవిడ్‌ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రణాళికలను గురువారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ఆదేశించింది. జన సమూహం ఎక్కువ లేకుండా హోలీ వేడుకలు నిర్వహించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. విద్యా సంస్థలు, జైళ్లు, కోర్టుల విషయంలోనే కాకుండా సభలు–సమావేశాల నిర్వహణ విషయంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న నేపథ్యంలో హోలీ వేడుకలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని హైదరాబాద్‌కు చెందిన గంపా సిద్ధలక్ష్మి ‘పిల్‌’ వేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

‘కోవిడ్‌ కోరలు పీకేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలి. వైరస్‌లు మురికివాడల నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ కోణంలో ప్రభుత్వం మురికివాడలపై ప్రత్యేక దృష్టి సారించాలి. జనం గుమిగూడేలా సమావేశాలు, సభలు నిర్వహించే విషయంలో పోలీసులు ఇచ్చిన అనుమతులపై తిరిగి సమీక్ష చేయాలి. నిందితులు హాజరు కావాల్సిన కేసుల్లో కింది కోర్టులు కఠినంగా వ్యవహరించకూడదు. కక్షిదారులు కోర్టులకు రాకుండా బార్‌ అసోసియేషన్లు చర్యలు తీసుకోవాలి. కోర్టుకు వచ్చే వారికి మాస్క్‌లు ఇచ్చేలా అన్ని కోర్టులు చర్యలు తీసుకోవాలి. పెద్ద ఎత్తున జనసమూహం ఉన్నప్పుడు కోవిడ్‌ వైరస్‌ సులభంగా తీవ్రం అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై వైరస్‌ నివారణకు చర్యలు తీసుకోవాలి.

జనసమూహం నిర్వహించే హోలీ వేడుకల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. వీటి నిర్వహణపై ప్రభుత్వం ప్రజలను చైతన్యపర్చాలి. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వివిధ సంస్థలకు అవకాశం ఇవ్వాలి. పాఠశాలలు, కాలేజీలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, జైళ్లలో కోవిడ్‌ వైరస్‌ విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ అనుమానిత రోగుల కోసం ప్రత్యేక గదులు, బెడ్‌లు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్యలను వివరిస్తూ గురువారం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.  

జైళ్లలో ఖైదీల విషయంలో..  
కోవిడ్‌ను అంతం చేయకపోతే భవిష్యత్‌ అంధకారం అయ్యే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలోని ఖైదీలకు వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉత్తర్వులు జారీ చేయాలని జైళ్ల శాఖ డీజీని ధర్మాసనం ఆదేశించింది. జైళ్లల్లో ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు తేలితే తక్షణమే చర్యలు తీసుకోవాలని,  ప్రత్యేక వార్డు ఉండేలా చేయాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు