మళ్లీ టెండర్లు పిలవండి: హైకోర్టు

10 May, 2018 01:15 IST|Sakshi
హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ప్రాంతంలో సమగ్ర భద్రత సేవలకోసం తిరిగి టెండర్లను ఆహ్వానించాలని హెచ్‌ఎండీఏను హైకోర్టు ఆదేశించింది. మూడేళ్లకోసం ఆ సేవలను ఎజైల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించడాన్ని రద్దు చేస్తూ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచందర్‌రావు తీర్పు చెప్పారు. ఎజైల్‌ సంస్థకు టెండర్‌ ఆమోదించడాన్ని సవాల్‌ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ ప్రైవేట్‌ సంస్థ వేసిన రిట్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ఎజైల్‌కు టెండర్‌ ఆమోదించామని హెచ్‌ఎండీఏ చెప్పింది. సీసీటీవీ, మెటల్‌ డిటెక్టర్‌ వంటి సౌకర్యాలకు, తామిచ్చిన ధ్రువీకరణ పత్రానికి సంబంధం లేదని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ న్యాయవాది వివరించారు. తొలుత పొరపాటుగా ధ్రువీకరణ పత్రం ఇచ్చామని, తర్వాత సవరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశామని చెప్పారు. దాంతో ఎజైల్‌ సంస్థకు ఇచ్చిన టెండర్‌ను రద్దు చేసిన హైకోర్టు, నాలుగు వారాల్లోగా తిరిగి టెండర్లను ఆహ్వానించాలని హెచ్‌ఎండీఏను ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.  

మరిన్ని వార్తలు