సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపితే జైలుశిక్షా? 

20 Feb, 2019 02:24 IST|Sakshi

కింది కోర్టు తీర్పును తప్పుపట్టిన హైకోర్టు

రూ.500 జరిమానా.. యువకుడి తక్షణ విడుదలకు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపిన ఓ యువకుడికి 4 రోజుల జైలుశిక్ష విధిస్తూ సైబరాబాద్‌ నాలుగో స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఉత్తర్వులు ‘కఠిన’మైనవిగా హైకోర్టు అభివర్ణించింది. ఇటువంటి చిన్న నేరాలకు జైలుశిక్ష విధించడం సబబుకాదని అభిప్రాయపడింది. వివరాలు.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపారని పోలీసులు భరద్వాజ్‌ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్‌ నాలుగో స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ అతడికి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ భరద్వాజ్‌ మేనమామ, కొండాపూర్‌కు చెందిన పంతంగి రమాకాంత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.శశికిరణ్‌ వాదనలు వినిపించారు.

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం నేరమే అయినప్పటికీ, ముందు జరిమానా విధించి ఓ హెచ్చరిక జారీ చేసి ఉంటే బాగుండేదని ధర్మాసనం అభిప్రాయపడింది.  చిన్న తప్పుకు జైలుశిక్ష అనుభవిస్తే, సమాజం ఆ యువకుడిని దోషిగా చూస్తుందని, దీని వల్ల అతని కుటుంబం వేదన అనుభవించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. న్యాయాధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని, 4 రోజులు జైలులో ఉండొస్తే, ఆ కళంకం ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. జైలుశిక్షను రద్దు చేసి అతనికి రూ.500 జరిమానా విధించింది. అతన్ని తక్షణమే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు