వారికి ఏం రక్షణ ఉన్నట్లు?

27 Apr, 2018 02:30 IST|Sakshi

సంపత్‌ ఏం చేశారని బహిష్కరణ వేటు వేశారు?

వీటిపై మాకు స్పష్టతనివ్వండి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : ‘అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభలో ఉండటం అసౌకర్యంగా ఉందని భావించి, వారిని బహిష్కరిస్తుంటే, ఆ సభ్యులకు చట్ట ప్రకారం ఏం రక్షణ ఉన్నట్లు’అని హైకోర్టు ప్రశ్నించింది. కోమటిరెడ్డి బహిష్కరణకు మండలి చైర్మన్‌పై హెడ్‌ఫోన్‌ విసరడం కారణమైనప్పుడు, సంపత్‌ను ఏ కారణంతో బహిష్కరించారో చెప్పాలని అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫు సీనియర్‌ న్యాయవాదిని నిలదీసింది. ఈ రెండు విషయాలపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. గురువారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానంతోపాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్‌ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఈనెల 17న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. అప్పీల్‌ దాఖలుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా? వద్దా? అనే దానిపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ తన వాదనలను వినిపిస్తూ, సభ ప్రతిష్టను దిగజార్చేలా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే, వారిని బహిష్కరించే అధికారం సభకు ఉందని వివరించారు. 

బహిష్కరణకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 184(3) ప్రకారం సభకు కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం సభకు ఉందని, ఆ మేరకే కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించారని చెప్పారు. సింగిల్‌ జడ్జి తన తీర్పులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బహిష్కరణ ఉందని చెప్పారే తప్ప, సభ్యుల అనుచిత ప్రవర్తన గురించి పట్టించుకోలేదని వివరించారు. మండలి చైర్మన్‌పై హెడ్‌ఫోన్‌ విసిరినట్లు కోమటిరెడ్డి, సంపత్‌ తమ పిటిషన్‌లోనే అంగీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. 

ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తీర్మానంలో ప్రస్తావించలేదు కదా? హెడ్‌ఫోన్‌ విసరడం వల్లే బహిష్కరించినట్లు ఎక్కడ పేర్కొన్నారు? అని ప్రశ్నించింది. హెడ్‌ఫోన్‌ విసిరి గాయపరిచిన ఘటనకు సభ మొత్తం సాక్ష్యమని, అలాంటి వాటికి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని వైద్యనాథన్‌ తెలిపారు. దీనికి ధర్మాసనం.. కోమటిరెడ్డిని హెడ్‌ఫోన్‌ విసిరిన కారణంగా బహిష్కరించామంటున్నారు.. మరి సంపత్‌ను ఏ కారణంతో బహిష్కరించారని అడిగింది. దీనికి వైద్యనాథన్‌ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై తమకు స్పష్టతనివ్వాలని వైద్యనాథన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్‌ విచారణార్హతపై వాదనలు వినిపించాలని కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  

కోమటిరెడ్డి న్యాయవాదిపై ఆగ్రహం 
వాదనలు ప్రారంభం కావడానికి ముందు కోమటిరెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్‌ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. సింగిల్‌ జడ్జి వద్ద కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫున ఒక్కరే అఫిడవిట్‌లు దాఖలు చేసి.. తమ ముందు మాత్రం వేర్వేరుగా దాఖలు చేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది అభ్యంతరం చెబితే, విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వైద్యనాథన్‌ స్పందించకపోవడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. 

మరిన్ని వార్తలు