పరేడ్‌ చేయించే అధికారం మీకెక్కడిది?

22 Jun, 2018 02:14 IST|Sakshi

నిందితులను బహిరంగంగా పరేడ్‌ చేస్తుండటంపై హైకోర్టు వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: పలు కేసుల్లో నిందితులను, అనుమానితులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకొచ్చి బహిరంగంగా పరేడ్‌ చేయిస్తుండటం పట్ల ఉమ్మడి హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇలా అనుమానితులను, నిందితులను బహిరంగంగా పరేడ్‌ చేయించి, వారి ఫొటోలను ప్రచురించుకునేందుకు, ప్రసారం చేసుకునేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు అనుమతిచ్చే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది.

ఓ పౌరుడి వ్యక్తిగత హుందాతనానికి విఘాతం కలిగించే హక్కు పోలీసులకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కని, పౌరుడు నిందితుడు లేదా దోషి అయినప్పటికీ, అతని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు పోలీసులకు అధికారం లేదని చెప్పింది. ఏ అధికారంతో నిందితులను, అనుమానితులను పోలీసులు ఇలా బహిరంగంగా పరేడ్‌ చేయిస్తున్నారో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా, ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి తన తల్లి కావటి అలివేలును దొంగగా అనుమానిస్తూ ఆమెను అరెస్ట్‌ చేసి శ్రీశైలంలో మీడియా ముందు ప్రవేశపెట్టడమే కాక, ఆమె ఫొటోలను తీసుకునేందుకు మీడియాకు అనుమతినిచ్చారంటూ ప్రకాశం జిల్లా, చీరాల మండలం, ఆదినారాయణపురానికి చెందిన కావటి సాగర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన తల్లిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. 

మరిన్ని వార్తలు