ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

29 Oct, 2019 02:45 IST|Sakshi

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

రూ.4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి.. రూ.47 కోట్లు తక్షణమే ఇవ్వగలరా?

డబ్బిచ్చే స్థితిలో ప్రభుత్వం ఉందా?

సమ్మెను ప్రజల ఇబ్బందుల కోణంలో చూడండి.. 

యూనియన్‌ కోణంలో కాదు

విలీనం సహా అన్ని డిమాండ్లపైనా చర్చించాలని చెప్పాం

21 డిమాండ్లు ఆర్థికంగా ఇబ్బంది కాదని మాత్రమే చెప్పాం.

ప్రతీ చిన్న దానిపై  న్యాయ సమీక్షకు తావులేదు: ఏఏజీ

ఇది ప్రజాసమస్య.. ఆకాశమే హద్దంటూ ధర్మాసనం వ్యాఖ్య

చర్చలపై ప్రభుత్వం, యూనియన్‌ పరస్పర ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆర్టీసీకి చట్ట ప్రకారం చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల బకాయిల్లో కనీసం రూ.47 కోట్లయినా ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉందో లేదో వెంటనే తెలపాలి. సమస్యను యూనియన్, ఇతర అంశాల కోణంలో చూడొద్దు. సామాన్య ప్రజల రవాణా ఇబ్బందుల కోణంలోనే చూడాలి. నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ 40 శాతమే బస్సులు నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ఓ గిరిజన వ్యక్తి తన బిడ్డకు జబ్బు చేస్తే చేతుల్లో పెట్టుకుని వరంగల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగలడా. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు డెంగీతో బాధపడే రోగిని అంబులెన్స్, ప్రైవేటు వాహనాల్లో తీసుకురాలేని వాళ్లు తన బిడ్డల ప్రాణాలపై ఆశలు వదులుకోవాలా? అలాంటి వాళ్లను చచ్చిపోనిస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం తక్షణమే రూ.47 కోట్లు ఇస్తే.. బిడ్డల ప్రాణాలు నిలుస్తాయి కదా.. ప్రభుత్వం ఆర్థికంగా ఆర్టీసీని ఎలా ఆదుకుని నాలుగు డిమాండ్ల పరిష్కారానికి ఏ నిర్ణయం తీసుకుంటుందో మంగళవారం చెప్పాలి’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, అలాగే కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధి గల ఉన్నతాధికారి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ స్కాలర్, ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాల్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం 2 గంటల పాటు విచారించింది.

అన్ని డిమాండ్లపై చర్చించాలి కదా..
తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదిస్తూ.. ఈ నెల 26న యూనియన్‌ ప్రతినిధులతో చర్చలకు ఆహ్వానించామని, అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆంశంపై చర్చిస్తేనే ఇతర అంశాల్లోకి వెళ్తామని యూనియన్‌ ప్రతినిధులు షరతు విధించారని చెప్పారు. యూనియన్ల తరఫు సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. విలీనం డిమాండ్‌ వదులుకున్నామని తాను చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాదే చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. 21 డిమాండ్లనే చర్చించాలని హైకోర్టు చెప్పినట్లు అధికారులు తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. 21 డిమాండ్లు ఆర్థికంగా పెద్దగా సంబంధం లేనివని మాత్రమే చెప్పామని, అన్ని డిమాండ్లపైనా చర్చ జరపాలనే 18న ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కడో ఓ చోట నుంచి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నాల్లో భాగంగా 21 డిమాండ్లపై చర్చలు జరిపి ఉంటే విశ్వాసం పెరిగేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు తగ్గిందనే భావన వచ్చేదని అభిప్రాయపడింది.

అలాంటప్పుడు చర్చలెందుకు..?
చర్చలకు ముందే ఫలితాలు ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఈడీ కమిటీ నివేదిక రూపొందించినట్లు ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లోజ్‌డ్‌ మైండ్‌ ఫలితం కూడా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు చర్చలు జరపడం ఎందుకు? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 4 డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయని తేల్చిన కమిటీ.. మిగిలిన డిమాండ్లను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. కోర్టు అంటే ఆషామాషీగా తీసుకున్నట్లుగా ఉందని, ప్రధానంగా ఉన్నతాధికారుల వైఖరి దారుణంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీవ్ర ఆర్థిక భారమయ్యే డిమాండ్లు రెండే ఉన్నాయని, మిగిలిన డిమాండ్లపై అధికారులు ఎందుకు కసరత్తు చేయలేదని ప్రశ్నించింది. గతంలో కార్మికులకు 44 శాతం వేతనం పెంచామని ఏఏజీ చెప్పగానే, అప్పుడు అంత విశాల హృదయంతో ఉదారంగా ఇవ్వడమెందుకో, ఇప్పుడు ఏమీ ఇవ్వలేమనడం ఎందుకో, అప్పుడు 22 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించారో చెప్పాలని ధర్మాసనం కోరగా, ఆర్టీసీ ఉద్యోగుల్లో మార్పు వస్తుందనే ఆశతో ఉన్నామని ఏఏజీ బదులిచ్చారు.

కార్మికులు కారణం కాదు
ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వల్ల ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు రూ.4 వేల కోట్లకుపైగా ఉన్నాయని, వీటిని ప్రభుత్వం చెల్లించకపోగా అప్పులు చేసి ఆర్టీసీ కార్పొరేషన్‌ను ఆర్థికంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని చెప్పారు. సిటీ బస్సులకు జీహెచ్‌ఎంసీ 1,492 కోట్లు, ప్రభుత్వ రాయితీల నిమిత్తం రూ.1,099 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్‌ రూ.454 కోట్లు, ఉద్యోగుల సహకార సంఘం నిధులు రూ.400 కోట్ల వరకు మొత్తం రూ.4 వేలు కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిపోలను 95 నుంచి 97కు పెంచారని, ఉద్యోగులు 65,740 నుంచి 49,733కు తగ్గినా సగటు ఉత్పాదక పెరిగిందని, నష్టాలకు ప్రభుత్వ/ఆర్టీసీ సంస్థ యాజమాన్య నిర్వాకమే కారణమని చెప్పారు. తలసరి ఉత్పాదకత 55 కి.మీ. నుంచి 61 కి.మీ.లకు పెరిగిందని, సగటు 326 కి.మీ. నుంచి 342 కి.మీ. నడపుతున్నారని, 91.48 లక్షల నుంచి 97.55 లక్షలకు రోజుకు గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 74.5 శాతానికి పెరిగేందుకు ఆర్టీసీ కార్మికులు శ్రమించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల బకాయిల్లో రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌–226 కింద ప్రతీది న్యాయ సమీక్ష చేసేందుకు హైకోర్టుకు తావులేదని ఏఏజీ అనడాన్ని కోర్టు తప్పపట్టింది. ‘10 వేల బస్సుల్లో 4 వేలు మాత్రమే నెల రోజులుగా నడుస్తున్నాయి. ప్రజా రవాణా కుంటుపడింది. రోగుల ఇక్కట్లు వర్ణనాతీతం. సామాన్య ప్రజల కష్టాలే తమ ముందు ప్రధాన అంశం. పౌరహక్కులు, మానవహక్కుల అంశంతో ముడిపడిన వ్యవహారమిది. మాకు ఆకాశమే హద్దు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం న్యాయ సమీక్ష చేస్తాం’అని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

ఏజీ హాజరుకు ఆదేశం..
చాలా కార్యక్రమాలకు, పథకాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజా రవాణా సమస్య పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వగలదో లేదో, ఆ విధమైన ఆర్థిక స్థోమత ఉందో లేదో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్టీసీ సొంతగా ఆర్థికాభివృద్ధి సాధించాలని, ఎంతకాలం ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని ఏఏజీ బదులిస్తూ.. ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ తాము ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తెలుసుకోవాలని నిర్ణయించామని, హైకోర్టు ప్రభుత్వ ప్రతినిధిగా ఏజీని విచారణకు పిలిపించాలని ఆదేశించింది. ఏజీ వచ్చిన వెంటనే ‘ఈడీ కమిటీ నివేదికలో 4 డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు అవసరం అవుతాయని తేల్చింది. ఆ మొత్తాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వగలదో లేదో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించి మంగళవారం చెప్పండి. మిగిలిన డిమాండ్లకు ఆర్థికంగా ఎంత భారం పడుతుందో తెలుసుకోండి. వీటి విషయంలో కసరత్తు చేసినట్లుగా ఈడీల నివేదికలో లేదు’అని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ఏజీ కోరితే మంగళవారం ఉదయం బదులు మధ్యాహ్నం విచారిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా