రాజీనామా చేసి వెళ్లండి: హైకోర్టు

21 Jan, 2020 04:01 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హితవు

కాలుష్య నివారణపై ధర్మాసనం అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: కాలుష్య నివారణ చర్యలు తీసుకోలేన ప్పుడు పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాల్లో కాలుష్య నివారణ చర్యలపై ధర్మాసనం తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసింది. కూకట్‌పల్లి చెరువు కాలుష్యంపై పత్రికల కథనాన్ని హైకోర్టు సుమోటో గా ప్రజాహితవ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారించింది. కాలుష్యం సమస్య పరి ష్కారానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చిత్తశుద్ధితో పనిచేయాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లా లని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

15 రోజులకోసారి చెరువుల్లో చెత్త తొలగిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కౌంటర్‌లో పేర్కొనడాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ.. ఏ తేదీల్లో తొలగిస్తున్నారో, ఫొటోలు ఎప్పు డు తీశారో వంటి వివరాలు లేకపోవడాన్ని తప్పుపట్టింది. బెంగళూరులోని చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని పలు అంతస్తుల భవనాలను నిర్మించడమే కాకుండా చెరువులోకి రసాయన వ్యర్థాలను వదిలిపెట్టడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, చిన్న పాటి వర్షానికే కాలుష్య నురగలు జనావాస కాలనీల్లోకి వచ్చాయని హైకోర్టు గుర్తు చేసింది. సమయం ఇస్తే కౌంటర్‌ దాఖలు చేస్తామని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయ వాది చెప్పారు. కూకట్‌పల్లి చెరువులో బతుకమ్మ సమయంలో పూలను, వినాయక చవితి సందర్భం గా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని, చెరువు లో 15 రోజులకోసారి చెత్త తొలగిస్తున్నామని తెలిపారు. విచారణ వచ్చే నెల 7కి వాయిదా పడింది.

27న హాజరుకావాలి..: జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్య నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు తీసుకున్న నివారణ చర్యలు తెలియజేయాలంది. డంపింగ్‌ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై 2 నెలల్లో పత్రికల్లో పలు కథనాలు వచ్చాయని, ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఈ నెల 27న జరిగే తదుపరి విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హాజరుకావాలని ఆదేశించింది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యపై పత్రికల్లో వచ్చిన కథన ప్రతిని జత చేస్తూ హైకోర్టుకు కల్నల్‌ సీతారామరాజు లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా పరిగణించి చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.  

మరిన్ని వార్తలు