‘ప్రైవేటీకరణ’పై తదుపరి చర్యలొద్దు

9 Nov, 2019 04:06 IST|Sakshi

5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ‘ప్రస్తుతం రాష్ట్రం కార్మిక సంఘాల సమ్మె గుప్పిట్లో ఉంది. దీనిపై పలు పిల్స్‌ దాఖలయ్యాయి. దీంతో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని మేం కోరాం. ఈ సంక్షోభ పరిస్థితులు ఉండగా కార్మిక సంఘాలు, ప్రజల మనసులను ఆందోళనవైపు పురిగొల్పేలా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు కేబినెట్‌ నిర్ణయంపై తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశిస్తున్నాం’అని ఉత్తర్వులిచ్చింది.

కేబినెట్‌ నిర్ణయానికి సంబంధించిన కాపీని ‘రహస్యమైనది’గా ప్రభుత్వం పేర్కొనడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన దృష్ట్యా ఆ నిర్ణయం చట్టానికి లోబడి ఉందా? చట్ట వ్యతిరేకమైనదా? అన్నది తాము తేలుస్తామని, ఆ కాపీని తమ ముందు ఉంచాలని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కాపీని అందుబాటులో ఉంచలేదు... 
5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ ఈ నెల 2న కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. «మంత్రిమండలి నిర్ణయం కాపీ ఎక్కడని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ధర్మా సనం ప్రశ్నించింది. ఆ కాపీని ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు.

ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ స్పందిస్తూ 5,100 రూట్ల విషయంలో  కౌంటర్‌ దాఖలు చేశామని, అందువల్ల సోమవా రం విచారణ చేపట్టాలని కోరారు. కేబినెట్‌ నిర్ణయం తాలూకు కాపీని సోమవారానికల్లా తమ ముందుంచాలని, 5,100 రూట్ల ప్రైవేటీకరణపై ఏ చర్యలు తీసుకోబోమని మౌఖిక హామీ ఇవ్వాలని ఏజీకి ధర్మాసనం స్పష్టం చేసింది.

అంత తొందరెందుకు...? 
దీనికి ఏజీ బదులిస్తూ కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కోర్టు విచారణ జరుపుతున్నప్పుడు చట్టం అమలులో అంత తొందరెందుకని ప్రశ్నించింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రం తీసుకొచ్చిన సవరణ చట్టానికి వ్యతిరేకం కాదని ఏజీ చెప్పారు. కావాలంటే సవరణ చట్టాన్ని పరిశీలించాలని కోరారు.

సోమవారం విచారణ జరుపుతామని, కేబినెట్‌ నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ ఉత్తర్వులను తాము వ్యతిరేకిస్తున్నామని ఏజీ చెప్పగా ఇంతకీ కేబినెట్‌ నిర్ణయం తాలూకు కాపీ సంగతి ఏమిటని ప్రశ్నించింది.

కేబినెట్‌ నిర్ణయం రహస్యమేమీ కాదు... 
మంత్రిమండలి నిర్ణయం తాలూకు కాపీని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, అది ప్రత్యేక, అసాధారణమైనదని(ప్రివిలేజ్డ్‌) ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. ఈ విషయంలో తమ వాదనతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. న్యాయస్థానం ముందు కేబినెట్‌ నిర్ణయాన్ని సవాలు చేసినప్పుడు, ఆ నిర్ణయం ఎలాంటిదన్నది తేల్చాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. న్యాయస్థానం కోరితే ఆ నిర్ణయం తాలూకు కాపీని ఇవ్వాల్సిందేనని, మంత్రిమండలి నిర్ణయం రహస్యమేమీ కాదని స్పష్టం చేసింది. మంత్రిమండలి నిర్ణయం కాపీని రహస్యంగా ఉంచడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది.

కావాలంటే ఆ ఉత్తర్వులిచ్చుకోండి... 
కేబినెట్‌ నిర్ణయాన్ని పిటిషనర్‌ ప్రశ్నించజాలరని ఏజీ చెప్పగా, ఈ వాదనతో ధర్మాసనం విబేధించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో పిటిషనర్‌ పాత్ర చాలా పరిమితమని, జరుగుతున్న అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో పిటిషనర్‌ పాత్ర ముగుస్తుందని ధర్మాసనం తెలిపింది. ఆ తరువాత హైకోర్టుకు, ప్రభుత్వానికి మధ్యే వ్యవహారం ఉంటుందని గుర్తుచేసింది. మంత్రిమండలి నిర్ణయం తాలూకు కాపీ ఇవ్వకుంటే దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అంతేకాక సాక్ష్యాల చట్టంలోని సెక్షన్‌ 114 కింద దాన్ని వ్యతిరేక సాక్ష్యంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. అలా అయితే అటువంటి ఉత్తర్వులు జారీ చేయవచ్చునని ఏజీ చెప్పారు. ఏజీ ఇంత కరాఖండిగా మాట్లాడటంతో ధర్మాసనం విస్మయం చెందింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ప్రైవేటీకరణ నిర్ణయం అందుకే: ప్రభుత్వం 
5,100 రూట్ల ప్రైవేటీకరణ విషయంలో సీఎస్‌ ఎస్‌.కె.జోషి కౌంటర్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సవరణ చట్టం నేపథ్యంలోనే ప్రభుత్వం రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రవాణాలో పోటీ, ప్రయాణికులకు సౌకర్యం, పోటీతత్వం వల్ల టికెట్‌ ధరల తగ్గుదల, భద్రత వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి మండలి నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని పిల్‌ను కొట్టేయాలని కోరారు.

ఆర్టీసీపై సీఎం సమీక్ష 
ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఐఏఎస్‌ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్షించారు. కోర్టు వ్యాఖ్యలు, ప్రైవేటు బస్సుల పర్మిట్ల వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించడం, ఆర్టీసీ విభజనపై కోర్టులో జరిగిన వాదనలపై సీఎం చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ జోషి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ నెల 11న కోర్టులో వాదనలు ఉన్నందున అనసరించాల్సిన తీరుపై సీఎం సలహాలు ఇచ్చినట్లు సమాచారం. తదుపరి విచారణలో వాటిపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చ జరిగింది. సమ్మె దృష్ట్యా ఆర్టీసీ చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా