అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో సర్కారుకు ఊరట

13 Oct, 2018 01:57 IST|Sakshi

ఈ విషయంలో గవర్నర్‌కు ప్రత్యామ్నాయం లేదు

సభను సమావేశ పరచడం.. సభ్యుల అభిప్రాయం అనవసరం

కేబినెట్‌ సిఫారసు మేరకు గవర్నర్‌ అసెంబ్లీని రద్దు చేయవచ్చు

గవర్నర్‌ ఉత్తర్వులు రాజ్యాంగ బద్ధమే.. కోర్టుల జోక్యం తగదు

ఓటరు నమోదు అర్హత తేదీ మార్చే అధికారం ఈసీకి లేదు

ఈ దిశగా న్యాయస్థానాలు కూడా ఆదేశించలేవు

కాంగ్రెస్‌ నేతలకు చుక్కెదురు.. అసెంబ్లీ రద్దు వ్యాజ్యాల కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ రద్దుకు మంత్రి మండలి సిఫారసు చేసినప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బీ) కింద.. రద్దు ఉత్తర్వులు జారీచేసే అధికారం గవర్నర్‌కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. సభ రద్దు విషయంలో గవర్నర్‌.. సభను హాజరుపరిచి సభ్యుల అభిప్రాయాలను, ఆమోదాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 163(1) ప్రకారం కేబినెట్‌ సలహా మేరకు గవర్నర్‌ వ్యవహరిస్తారని, అయితే ఎప్పుడు విచక్షణాధికారాలను ఉపయోగించాలో అప్పుడే ఆయన ఆ అధికారులను ఉపయోగిస్తారని పేర్కొంది. ఈ ఆర్టికల్‌ ప్రకారం.. కేబినెట్‌ నిర్ణయాన్ని అమలుచేయడం మినహా.. గవర్నర్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని వెల్లడించింది.

అనవసర సందర్భాల్లో ఆయన తన విచక్షణాధికారాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని తెలిపింది. కేబినెట్‌ సలహాలను పాటించాల్సిన అవసరం లేని సందర్భాల్లో మాత్రమే.. ఆయన తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారని స్పష్టం చేసింది. అందువల్ల.. అసెంబ్లీ రద్దు సమయంలో గవర్నర్‌ సభను హాజరుపరచాల్సిందేనన్న.. పిటిషనర్ల వాదన చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీ భట్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని.. దీనివల్ల 20 లక్షల మంది యువత తమ ఓటు హక్కును కోల్పోతారంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్‌.అభిలాష్‌రెడ్డిలు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సైతం రాష్ట్రపతి పాలన డిమాండ్‌ చేస్తూ పిల్‌ వేశారు. వీటిపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం పై తీర్పును వెలువరించింది. 

అసెంబ్లీ రద్దు రాజ్యాంగబద్ధమే! 
‘తెలంగాణ అసెంబ్లీని మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయన రాజ్యంగబద్ధంగానే ఇచ్చారు. అసెంబ్లీ రద్దు విషయంలో న్యాయస్థానాల జోక్యం ఎంత మాత్రం అవసరం లేదని భావిస్తున్నాం. అసెంబ్లీ రద్దు వెనుక దురుద్దేశాలు, అసాధారణ కారణాలుంటే తప్ప గవర్నర్‌ ఉత్తర్వుల్లో జోక్యం తగదని గతంలో ఈ హైకోర్టు ధర్మాసనమే తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మేం పూర్తిగా ఏకీభవిస్తున్నాం’అని ధర్మాసనం తెలిపింది.
 
శాసనపరమైన నిర్ణయాన్ని మార్చలేం 
‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 21 ప్రకారం ఓటర్ల జాబితా, ప్రచురణ నిరంతరం జరిగే ప్రక్రియ. ఓటరు అర్హత తేదీని చట్ట సభలు ప్రతీ ఏడాది జనవరి 1గా నిర్ణయించాయి. దీనిని ఒక్కో ఎన్నిక కోసం ఒక్కో రకంగా మార్చడానికి వీల్లేదు. మరో తేదీని నిర్ణయించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదు. ఇదే సమయంలో అర్హత తేదీని ఆర్టికల్‌ 226 కింద కోర్టులు ఇచ్చే ఉత్తర్వుల ద్వారా కూడా మార్చడానికి వీల్లేదు. 2019 జనవరిలో కూడా ఎన్నికలు నిర్వహించవచ్చునని, తద్వారా ఆ ఏడాది జనవరి 1వ తేదీకి ఓటరుగా అర్హత ఉన్న వారికి జాబితాలో చోటు దక్కుతుందంటున్నారు. కానీ.. వాదన మమ్మల్ని సంతృప్తిపరచలేదు. అర్హత తేదీ నిర్ణయం శాసనపరమైన నిర్ణయం. దీనిని ఒక్కో ఎన్నిక కోసం ఒక్కో రకంగా మార్చడం వీలులేదు. ఓటర్ల జాబితా తయారీ, మార్పులు, చేర్పులు తదితర విషయాలు న్యాయస్థానాలకు సంబంధించిన వ్యవహారాలు కాదు. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పాం’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ నిర్ణయాలను గుర్తుచేస్తూ.. తమ ముందున్న వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు తెలిపింది.  
 

మరిన్ని వార్తలు