ఎంఎస్‌పీపై భిన్నస్వరాలా? 

21 Dec, 2018 01:11 IST|Sakshi

కేంద్రప్రభుత్వ తీరుపై  హైకోర్టు అసహనం

శాఖకో అభిప్రాయమేంటన్న ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను ఖరారు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇటువంటి విషయాల్లో ఏకస్వరం, ఏకాభిప్రాయం అవసరమని, ఇందుకోసం అన్ని శాఖలు కలసి ఒకే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఓ ఉమ్మడి వేదిక ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంచేసింది. ఈ విషయంలో తాము ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఇవ్వొద్దని కేంద్రానికి ధర్మాసనం తేల్చి చెప్పింది. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను ఖరారు చేసే విషయంలో అనుసరిస్తున్న విధానానికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ల ధర్మాసనం రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

కనీస మద్దతు ధర నిర్ణయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ న్యాయవాది సీహెచ్‌.వెంకటరామన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం శాఖల భిన్నాభిప్రాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో ఏకస్వరం, ఏకాభిప్రాయం అవసరమని పేర్కొంది. ఎంఎస్‌పీ కోసం అనుసరిస్తున్న విధానంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది.   

>
మరిన్ని వార్తలు