కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి? 

11 Jun, 2020 09:09 IST|Sakshi

పీసీబీ పనితీరుపై హైకోర్టు అసంతృప్తి 

సాక్షి, హైదరాబాద్‌: విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ ఘటన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌ నగర శివారు జీడిమెట్లలో పారిశ్రామిక కాలుష్య కట్డడికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలు కలుషితం అవుతుంటే పీసీబీ చర్యలు ఆశాజనకంగా లేవని పేర్కొంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే గత నాలుగేళ్లల్లో 45 కేసులు మాత్రమే నమోదవడం పీసీబీ పనితీరును తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది. జీడిమెట్లలో భూగర్భ జలాలు కలుషితంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. 799 ఫార్మా కంపెనీలు ఉంటే వాటిలో 708కే అనుమతి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ చెప్పారు. 24 కంపెనీలకు నోటీసులు, 2 కంపెనీలను మూసివేయాలని, అలాగే పలు కంపెనీలపై 23 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గత ఆరు నెలల్లోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే కోర్టులో కేసు దాఖలైన తర్వాతే పీసీబీ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోందని తప్పుబట్టింది. శివారుల్లోని 220 బల్క్‌ డ్రగ్స్‌ యూనిట్స్‌లో చేసిన తనిఖీల నివేదికలను ఎందుకు వివరించలేదని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు