ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి

8 Sep, 2016 00:27 IST|Sakshi
ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి

4 వారాల్లో ‘పునరావాస అథారిటీ’ని ఏర్పాటు చేయాలని ఆదేశం

 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2013లో కొత్తగా తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు పునరావాస, పునర్నిర్మాణ అథారిటీని ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరావాస, పునర్నిర్మాణ అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తు చేసింది. నాలుగు వారాల్లో ఈ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రోరైల్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూమికి పరిహారం ఇచ్చే విషయంలో 2015లో వెలువరించిన అవార్డును రద్దు చేసి, 2013 భూ సేకరణ చట్టంలోని మొదటి షెడ్యూల్ కింద పరిహారం నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్, బేగంపేట్‌కు చెందిన ఎం.ఎ.అజీజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ బుధవారం విచారించారు.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వంగా రామచంద్రగౌడ్ వాదనలు వినిపిస్తూ, సర్దార్‌పటేల్ రోడ్‌లో పిటిషనర్‌కున్న 181 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం మెట్రోరైల్ కోసం సేకరించి, చదరపు గజానికి రూ. 50 వేలు చెల్లించాల్సి ఉండగా.. రూ.15 వేలు మాత్రమే పరిహారంగా చెల్లించిందన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ అథారిటీని ఇప్పటివరకూ ఏర్పాటు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరారు. అథారిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో న్యాయమూర్తి హైకోర్టు రిజిష్ట్రార్‌ను పిలిచి, అథారిటీ ఏర్పాటుపై ఏం నిర్ణయం తీసుకున్నారని ఆరా తీశారు. ప్రభుత్వానిదే ఆ బాధ్యతని స్పష్టం చేశామని రిజిష్ట్రార్ వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి 4 వారాల్లో అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మరిన్ని వార్తలు