హడావుడిగా ఎందుకు చేశారు?

15 Aug, 2019 03:34 IST|Sakshi

గడువు ఎందుకు తగ్గించారో చెప్పండి.. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సందేహాలు 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ వార్డుల విభజన ఏవిధంగా చేశారో, గతంలో చెప్పినట్లుగా ఎన్నికల ప్రక్రియకు అవసరమని చెప్పిన గడువును ఎందుకు తగ్గించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాత మున్సిపల్‌ చట్టానికి, కొత్త మున్సిపల్‌ చట్టానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించాలని కోరింది. ఈ వివరాల్ని శుక్రవారం(16న) నాడు జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ఆదేశించింది. మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని పేర్కొంటూ నిర్మల్‌ జిల్లాకు చెందిన కె.అంజుకుమార్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లాకు చెందిన డాక్డర్‌ ఎస్‌.మల్లారెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం ధర్మాసనం విచారించింది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందనే పలు మున్సిపాలిటీ ఎన్నికలపై సింగిల్‌ జడ్జి స్టే ఆదేశాల్ని రద్దు చేయాలని, పిల్స్‌ను కొట్టేయాలని ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. వీటన్నింటినీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్నికల ప్రక్రియను 109 రోజుల్లో చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క రోజులోనే చేస్తామంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది.

109 రోజులని చెప్పి 100 రోజుల్లో చేస్తే పర్వాలేదని, ఎనిమిది రోజుల్లోనే చేసేయడంపైనే తమకు సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. హడావుడిగా ప్రక్రియను ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని వివరణ కోరింది. వార్డుల విభజన ప్రక్రియ గతంలో ఎలా ఉండేదో.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ఏమిటో కూడా వివరించాలని ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు