ఆలయాల్లోనూ ప్లాస్టిక్కా...?

14 Nov, 2018 02:29 IST|Sakshi

     పుణ్యంకోసం వచ్చి పాపానికి ఒడిగడతారా?

     మత ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై వైఖరి చెప్పండి

     ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణానికి ప్రాణం పోయాల్సిందిపోయి దాని ఊపిరి తీసి పాతరేస్తారా? దేవుడిచ్చిన ప్రకృతి ప్రకోపించేలా చేస్తారా?.. ప్లాస్టిక్‌ వినియోగం ఆరోగ్యానికి హానికరమే కాకుండా ప్రకృతిపై ప్రతికూల పరిణామాలు ఉంటాయని తెలియదా? దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడూ పర్యావరణానికి ముప్పు తెచ్చే మహాపాపానికి ఒడిగడతారా? ఆలయా ల్లోనైనా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని అడ్డుకోలే రా? అంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. భూ గ్రహానికి అతి హీనమైన జాతిగా మానవుడు అడుగుపెట్టాడంటూ వ్యాఖ్యానించింది. దేవుడి పూజ సామగ్రిని ప్లాస్టిక్‌కవర్లో తీసుకువెళ్లే కొందరు భక్తుల కారణంగా ఆలయాల్లో అపరిశుభ్రతే కాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఆలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేసేందుకు ఏం చేస్తున్నారో తెలియచేయాలని 2 ప్రభుత్వాలను ఆదేశించింది. వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మొత్తం వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని ఇరు రాష్ట్రాల ఏజీలను ఆదేశించింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, మత సంస్థల నిర్వహణ, సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఆయా జిల్లాల ఆలయాల్లోని పరిస్థితులపై హైకోర్టుకు నివేదికలు అందజేశారు. వీటిని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి మంగళవారం విచారణ చేపట్టింది. పుణ్యం కోసం ఆలయాలు, మత సంస్థలకు ప్లాస్టిక్‌ కవర్లతో వెళ్లి ప్రకృతికే ముప్పు వాటిల్లే పాపానికి ఒడిగడతారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాల్లో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధాన్ని అమలు చేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వాల వైఖరిని తెలియజేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. దేవాలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం అమలుపై 2 ప్రభుత్వాలతోపాటు కాలుష్య నియంత్రణ మండళ్లు తమ వైఖరిని కూడా చెప్పాలని కోరింది. ప్రభుత్వాల తరఫున అడ్వొకేట్‌ జనరల్స్‌ వాదనల నిమిత్తం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు