ఎగ్జిబిషన్‌కు ఎన్వోసీలపై హైకోర్టు ఆగ్రహం

31 Dec, 2019 02:15 IST|Sakshi

ఎలా ఎన్వోసీలు ఇచ్చారో చెప్పండి

క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చారా.. ఆఫీసుల్లో ఉండే ఇచ్చారా..?

పార్కింగ్‌ చేసే చోట్ల నుంచి అనుమతి పొందారా

పూర్తి వివరాలతో రావాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలో ప్రతి ఏటా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)కు వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన నిరభ్యంతర సర్టిఫికెట్ల (ఎన్వోసీ)పై హైకోర్టు మండిపడింది. మొత్తం స్థలంలో 40 శాతం పార్కింగ్‌కు కేటాయించాలన్న నిబంధనను ఏవిధంగా అమలు చేశా రని ప్రశ్నించింది. గగన్‌విహార్, చంద్రవిహార్, ఆదాయపన్ను తదితర శాఖల భవనాల వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామని చెప్పడం కాదని, ఆయా శాఖల నుంచి అందుకు అనుమతులు పొందిందీ లేనిదీ చెప్పాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఆయా శాఖలు తనిఖీలు చేసిన తర్వాతే ఎన్వోసీలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏకపక్షంగా ఎన్వోసీలు ఇస్తే ఈ ఏడాది ఎగ్జిబిషన్‌ నిర్వహణకు కూడా అనుమతి ఇవ్వ బోమని తెలిపింది.

ఆయా శాఖల తనిఖీ నివేదికలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ సంఖ్యలో ఎగ్జిబిషన్‌ సందర్శనకు వస్తారని, అలాంటి చోట్ల ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటేనే అనుమతి ఇస్తామని పేర్కొంది. అన్ని వివరాలు మంగళవారం తమకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎగ్జిబిషన్‌ నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందలేదని, అప్పుడు జరిగిన అగ్నిప్రమాదానికి ఎగ్జిబిషన్‌ సొసైటీనే కారణమని, సొసైటీ నిర్వహకులపై క్రిమినల్‌ కేసులను నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.

జనవరి 1 నుంచి ప్రారంభం కాబోయే ఎగ్జిబిషన్‌కు అనుమతిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్‌వోసీ ఇచ్చిన ఆయా ప్రభుత్వ శాఖలు ఏ కారణాలతో నిరభ్యంతర పత్రాలు జారీ చేశారో స్పష్టం చేయకపోతే అనుమతి మంజూరు ఉండదని తేల్చి చెప్పింది. అనుమతులు పొందాల్సిన బాధ్యత ఎగ్జిబిషన్‌ సొసైటీ, ఆయాశాఖలదేనని చెప్పింది. ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లపై పోలీస్‌ కమిషనర్‌ దాఖలు చేసిన కౌంటర్‌ పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎగ్జిబిషన్‌ నిర్వహణ ఏరియాల్లో ఫుట్‌ పాత్‌ల ఆక్రమణలు తొలగించాలనే తమ ఆదేశాల్ని అమలు చేశారో లేదో చెప్పాలని పోలీసులను ఆదేశించింది.

ఎన్వోసీ ఇచ్చిన అధికారులు పరిహారం ఇస్తారా?
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ కల్పించుకుని ఎగ్జిబిషన్‌ సమీపంలో 40 ఏళ్లుగా ఫుట్‌పాత్‌లపై నివాసం ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు వాళ్లను తొలగించ డం ప్రభుత్వానికి కష్టమేనని చెప్పారు. పైగా అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత వస్తుందని గట్టిగా చెప్పారు. ఎగ్జిబిషన్‌ మైదానంలో మాక్‌డ్రిల్‌ నిర్వహణ జరిగిందని, ప్రమాదం జరిగితే యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న 2 నీటి ట్యాంకులు ఏర్పాటు చేశామని, అగ్నిప్రమాదం జరిగితే అక్కడికి తరలించేలా పైపులైన్లు వేశామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ అధికారులు కింది స్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలన  చేయకుండా గదుల్లో కూర్చుని ఎగ్జిబిషన్‌ నిర్వహణకు ఎన్వోసీ ఇచ్చినట్లుగా ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రమాదం జరిగితే ఎగ్జిబిషన్‌ సందర్శకులు ఎలా వెళ్లాలో ఏర్పాట్లు చేయాలని తేల్చి చెప్పింది.

ఒక వేళ ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని అనుకుందాం.. (ఇలా జరగాలని అనుకోకూడదు) అప్పుడు ప్రభు త్వం ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు చొప్పున ఇవ్వాల్సి వస్తే.. ఎన్వోసీ ఇచ్చిన అధికారులు ఇస్తారా అని ధర్మాసనం నిలదీసింది. ఎగ్జిబిషన్‌ నిర్వహణను జోక్‌లా తీసుకోరాదని, హైకోర్టులోనే రెండు సార్లు షార్ట్‌సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని, జైపూర్‌లోని హైకోర్టు బెంచ్‌ వద్ద కూడా ప్రమాదం జరిగిందని, లండన్‌లో అయితే ఒక్క అగ్గిపుల్ల కారణంగా సగం నగరం అగ్నికి ఆహుతి అయిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్వోసీలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే కుదరదని చెప్పింది. ఎన్వోసీ ఎలా ఇచ్చారో, ఏయే అంశాలపై సంతృప్తి చెందారో పూర్తి వివరాలతో మంగళవారం జరిగే విచారణ సమయంలో తమ ముందు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా