ఆ అధికారం మీకెక్కడిది?

13 Aug, 2015 00:50 IST|Sakshi
ఆ అధికారం మీకెక్కడిది?

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని పలు బ్యాంకులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు లేఖలు రాయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆ లేఖలకు స్పందిస్తూ ఏపీ ఇంటర్ బోర్డు బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తూ ఎస్‌బీఐ ఎంజే మార్కెట్ శాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ఇంటర్ బోర్డు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు లేఖ రాసే అధికారం మీకెక్కడిదని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిని నిలదీసింది.

ముందూ వెనుకా చూసుకోకుండా ఏపీ బోర్డు బ్యాంకు ఖాతాను ఎలా స్తంభింపజేస్తారని ఎస్‌బీఐని ప్రశ్నించింది. దీనివల్ల ఫీజులు కట్టిన విద్యార్థుల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? అని తెలంగాణ బోర్డు, ఎస్‌బీఐలపై మండిపడింది. బ్యాంకు ఖాతా స్తంభన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
 
తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యారు. తాను రాసిన లేఖలపై వివరణ ఇచ్చారు. దీనిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ బోర్డు బ్యాంకు ఖాతాల స్తంభనకు లేఖలు రాయాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందా? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ఇంటర్ బోర్డు తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తారని, విచారణను గురువారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.

పూర్తి రికార్డులతో గురువారం కోర్టు ముందు హాజరు కావాలని తెలంగాణ బోర్డు కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ బ్యాంకు ఖాతాను ఎస్‌బీఐ స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ఇంటర్ బోర్డు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

మరిన్ని వార్తలు