ఘోరతప్పిదాన్ని ఎలా సరిచేస్తారు? 

27 Dec, 2018 01:44 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

తెలుగుమీడియం అభ్యర్థులకు.. ఇంగ్లిష్‌లో ప్రశ్నలెలా వేస్తారు?

పంచాయతీ కార్యదర్శి పరీక్షలో 14 ప్రశ్నలు ఆంగ్లంలో ఇవ్వడంపై సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ నిర్వహించిన రాతపరీక్షలో తెలుగు మీడియం అభ్యర్థులకు 14 ప్రశ్నలను ఎటువంటి అనువాదం లేకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. దీనిని ఘోర తప్పిదంగా అభివర్ణించింది. పోటీ పరీక్షల్లో ఒక్కో మార్కు కూడా అభ్యర్థి జీవితాన్ని తారుమారు చేస్తుందని, అటువంటిది 14 ప్రశ్నలను ఇంగ్లిష్‌లోనే ఇచ్చారంటే అభ్యర్థులు 14 మార్కులు కోల్పోయినట్లేనని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థుల 4.62 లక్షల మంది పరిస్థితి ఏంటని, ఈ ఘోర తప్పిదాన్ని ఎలా సరి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చేసిన తప్పును ఒప్పుకుని దానిని సరిదిద్దుకోవాలే తప్ప, సమర్థించుకోవడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికింది. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసే ప్రసక్తే లేదని జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు తేల్చి చెప్పారు. తమకు స్పష్టత వచ్చేంత వరకు ఆ మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ 14 ప్రశ్నల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మొత్తం 6 ప్రశ్నలకు తుది కీలో ఇచ్చిన సమాధానాలు తప్పుగా ఉన్నాయంటూ అభ్యర్థులు చెబుతున్న నేపథ్యంలో వాటి విషయంలో ప్రభుత్వ వైఖరేంటో తెలపాలంటూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. 

నిబంధనల ప్రకారమే: సర్కారు 
ఇదిలా ఉంటే, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల విషయంలో రిజర్వేషన్లు 50% దాటాయన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో, సర్వీస్‌ సబార్డినేట్‌ రూల్స్‌ ప్రకారం 100 పాయింట్‌ రోస్టర్‌ను, ఆ రూల్స్‌లోని 22వ నిబంధనను, అలాగే జీవో 107 ప్రకారం నడుచుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అదే విధంగా స్పోర్ట్స్‌ కోటా కింద అర్హుల జాబితా తయారీ విషయంలోనూ తప్పు జరిగిందని, దానిని సరిదిద్దుకుంటామని వివరించింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగడం లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఇదే సమయంలో తుది కీలో పలు తప్పులున్నాయని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో ప్రశ్నలు ఇచ్చారంటూ మరికొంత మంది అభ్యర్థులు లంచ్‌ మోషన్‌ రూపంలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై కూడా న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు విచారణ జరిపారు. 

అందరికీ కోర్టుకొచ్చేంత స్తోమత ఉంటుందా? 
నలుగురైదుగురి కోసం మొత్తం నియామక ప్రక్రియను ఆపేయడం సరికాదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. బయట అభ్యర్థులు న్యాయస్థానాలను నిందిస్తున్నారని చెప్పారు. కోర్టుకొచ్చిన పిటిషనర్లకు మాత్రమే మధ్యంతర ఉత్తర్వులను పరిమితం చేయాలని కోరారు. దీనికి న్యాయమూర్తి ఒకింత ఘాటుగా స్పందిస్తూ.. ‘బయటకు ఎవరు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం. నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయా? లేదా? నిబంధనలు అమలు చేస్తున్నారా? లేదా? అన్నదే మాకు ముఖ్యం. కోర్టుకు రాలేని అభ్యర్థికి సైతం కోర్టు ఆదేశాలను వర్తింప చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ప్రతీ అభ్యర్థికి కూడా కోర్టుకు వచ్చే స్థోమత ఉండకపోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి హైకోర్టుకు వచ్చి, డబ్బిచ్చి న్యాయవాదిని పెట్టుకుని వాదనలు వినిపించే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి వారి సంగతేమిటి? వారు కోర్టుకు రాలేదు కాబట్టి వారికి మేం ఇచ్చే ఉత్తర్వులు వర్తించవద్దంటే ఎలా?’ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు దానిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలే తప్ప, ఆ తప్పు జరిగిన తీరును వివరిస్తూ దానిని సమర్థించుకునే ప్రయత్నం చేయరాదని హితవు పలికారు. ఈ వ్యవహారంపై సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేసిన న్యాయమూర్తి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సర్కారుకు సూచించారు. ఇదే సమయంలో పిటిషనర్లు పలు ప్రశ్నలకు అసలు సమాధానాలను, కీలో పొందుపరిచిన తప్పుడు సమాధానాలను ఇచ్చారంటూ ఆధారాలతో చూపగా.. వీటిని న్యాయమూర్తి రికార్డ్‌ చేసుకున్నారు.  
మా దృష్టికి తీసుకురాలేదు 
ఈ సమయంలో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, తమకు ఈ విధంగా 14 ప్రశ్నలు ఇంగ్లీష్‌లో వచ్చినట్లు తమ దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడు కోర్టుకొచ్చి రాద్దాంతం చేయడం సరికాదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘ఇప్పుడు తీసుకొచ్చారు కదా. తప్పును సరి చేయండి’అని సూచించారు. తెలుగు మీడియంలో ఎంత మంది పరీక్ష రాశారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. 4.62 లక్షల మంది రాశారని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ‘వారంతా కూడా ఈ 14 ప్రశ్నలను వదిలేసి ఉంటే మొత్తం నియామకపు ప్రక్రియ పరిస్థితే మారిపోతుంది. వీరిందరికీ కూడా 14 మార్కులు ఇవ్వాల్సి వస్తే అప్పుడు నియామకాల సంగతేంటి? ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయండి. నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ గతవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయి’అని పేర్కొన్నారు. 

ఇంగ్లిష్‌లో ఇస్తే.. వారికి కష్టమే కదా! 
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్‌.రాహుల్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏ మీడియం ఎంచుకున్న అభ్యర్థులకు ఆ మీడియంలో ప్రశ్నాపత్రం ఇవ్వాలని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్, దాని కిందనే తెలుగులో కూడా ప్రశ్న ఇచ్చారని తెలిపారు. అయితే 56 నుంచి 70 ప్రశ్నల వరకు ఇంగ్లీష్‌లోనే ప్రశ్నలున్నాయని, వాటిని తెలుగులోకి అనువదించలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన ప్రశ్నల కాపీలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉన్నాయని, వీటిని చదివి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో పిటిషనర్లు ఆ 14 ప్రశ్నలను వదిలేశారని వివరించారు. దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేస్తూ ..‘తెలుగు మీడియం అభ్యర్థులకు ఇలా 14 ప్రశ్నలను ఇంగ్లీష్‌లో ఇవ్వడం ఏంటి? ఇలా ఇస్తే అది వారికి కష్టమే కదా’అని వ్యాఖ్యానిం
చారు. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు కూడా జీవితాన్ని తలకిందులు చేస్తుందని, అలాంటిది ఏకంగా 14 ప్రశ్నలంటే, అది చాలా ఘోర తప్పిదమన్నారు.

>
మరిన్ని వార్తలు