పెద్దపల్లి పురపోరుకు బ్రేక్‌! 

9 Aug, 2019 13:10 IST|Sakshi

వార్డుల విభజనలో గందరగోళం నేపథ్యంలో 

స్టే ఇచ్చిన హైకోర్టు జిల్లాలో నిలిచిన నాలుగు బల్దియా ఎన్నికలు 

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల విభజన సరిగా జరుగలేదని  రంగంపల్లి గ్రామానికి చెందిన వేములరాజు, కాసు మహేందర్‌రెడ్డి  హైకోర్టును ఆశ్రయించారు. రంగంపల్లిలోని 10, 11, 12వార్డుల్లో ఉండాల్సిన ఓటర్లు 2 కి.మీల దూరంలోని ఎల్లమ్మచెరువుకట్ట కింద కాలనీల్లోని 32 వార్డులో చేర్చడాన్ని సవాలుచేస్తూ హైకోర్టు న్యాయవాది చింతలఫణి అవనిరెడ్డి హైకోర్టులో రిట్‌ వేశారు. దీనిపై న్యాయమూర్తి నర్సింగరావు విచారణ జరిపి పెద్దపల్లి మున్సిపల్‌ ఎన్నికలు నిలిపివేయాలంటూ ఉత్వర్వులు జారీ చేశారు.

నాలిగింటిపై స్టే.. 
ముందుగా సుల్తానాబాద్‌ నుంచి మొదలైన తిరుగుబాటు వ్యవహారం, హైకోర్టు నుంచి స్టే తీసుకరావడంపెద్దపల్లి వరకు చేరింది. రామగుండంలో ఇదేమాదిరిగా వార్డుల విభజన సక్రమంగా లేదని కాంగ్రెస్‌పార్టీ నాయకులు కొందరు కోర్టుకు వెళ్లారు. రామగుండం ఎన్నికనూ హైకోర్టు నిలిపివేసింది. మంథనిలోను కొందరూ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పెద్దపల్లిలో వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని కోర్టుకు వెళ్లడంతో పెద్దపల్లిపైనా స్టే విధించడంతో జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలపై హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా ఎన్నికలపై అనుమానాలు పెరిగాయి. ఇప్పటికే హైకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలపై కొందరూ కోర్టుకు వెళ్లగా ఇప్పుడు ఎక్కడిక్కడ మున్సిపాలిటీల వారీగా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసిన ఇక్కడస్థానికంగా ఎక్కడిక్కడ హైకోర్టుకు ఫిర్యాదులు వెళ్లడంతో స్టే విధించారు. దీంతో ఇక ఎన్నికలు జరుగడం ఇప్పట్లో అనుమానమేనంటున్నారు.

అన్నింటిపై ఒకేసారి తీర్పు... 
రాష్ట్రంలో సుమారు 60 చోట్ల నుంచి అభ్యంతరాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి. ఒక పెద్దపల్లి జిల్లాలోనే నాలుగు, ఉమ్మడి కరీంనగర్‌లో ఎనిమిది మున్సిపాలిటీలపై హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. అన్ని మున్సిపాలిటీలో కూడా వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందనేది పిటిషనర్ల వాదన. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి స్టే ఇప్పించాం. పెద్దపల్లిలో చాలా అద్వానంగా ఇష్టానుసారంగా వార్డుల విభజన, ఓటర్ల గుర్తింపు ప్రక్రియ జరిగింది. హైకోర్టులో పెండింగ్‌ ఉన్న కేసులన్నింటిపై ఒకే సమయంలో తీర్పు రానుంది. అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం.  – అవనిరెడ్డి, హైకోర్టు అడ్వకేట్‌ 
 

మరిన్ని వార్తలు