జైలు శిక్ష అమలు ఆపివేయాలి

17 Jul, 2019 19:41 IST|Sakshi

భవనాల కూల్చివేత విచారణ వాయిదా

 మల్లన్నసాగర్‌ భూవివాదంలో స్టే

పురపాలక ఎన్నికలకు నో

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు బుధవారం పలు కేసులను విచారించింది. ఈ సందర్భంగా మల్లన్నసాగర్‌ భూ వివాదం, మిర్యాలగూడ ఎన్నికలపై స్టే విధించగా సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా.. సచివాలయం, ఎర్రమంజిల్‌లో పురాతన భవనం కూల్చివేతల పిటిషన్‌పై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు తమ వాదనలను వినిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం చట్టబద్దంగానే కూల్చివేతల నిర్ణయం తీసుకుంది. నిపుణుల సిఫారసు మేరకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదు’ అని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఏ ప్రాతిపదికత ఆధారంగా పురాతన భవనాలను తొలగించారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరపు న్యాయవాది వివరణనిస్తూ.. ఎర్రమంజిల్‌ పురాతన భవనం కాదని, హెరిటేజ్‌ జాబితాలో ఎర్రమంజిల్‌ భవనం లేదని చెప్పుకొచ్చారు. అనంతరం చారిత్రక కట్టడాల కూల్చివేతపై కౌంటర్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణనుసోమవారానికి వాయిదా వేసింది.

విచారణ వాయిదా
మల్లన్నసాగర్‌ భూ వివాదంలో ముగ్గురు అధికారులకు జైలు శిక్ష అమలును తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో రైతులకు న్యాయం చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించారని సింగిల్‌ బెంచ్‌ ముగ్గురికి జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ  తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఎన్నికలకు నో
మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌ పురపాలక ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన సరిగా జరగలేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, బుధవారం కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. అనంతరం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు