కరీంనగర్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ 

10 Jan, 2020 02:41 IST|Sakshi

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్ని రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మూడు మున్సిపల్‌ డివిజన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాకే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది. పొన్నుస్వామి కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్, అంత కుముందు జరిగే ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తీర్పు వెలువరించింది. అప్పీల్‌ పిటిషన్‌ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయ వాది సంజీవ్‌కుమార్‌ సింగిల్‌ జడ్జి తీర్పు ప్రతిని ధర్మాసనానికి అందజేశారు. దానిని పరిశీలించిన అనంతరం సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 3, 24, 25 డివిజన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాక ఎన్నికలు నిర్వహించాలని, ఈ ఉత్తర్వులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై డివిజన్‌ బెంచ్‌ వెలువరించే తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొనడాన్ని గుర్తు చేసింది. పిల్‌ను తాము తోసిపుచ్చామని, సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొనసాగించలేమని పేర్కొంది.

24న కరీంనగర్‌ ఎన్నిక 
కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు లైన్‌ క్లియరైంది. ఈ కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లకు ఈ నెల 24న ఎన్నికల నిర్వహణతో పాటు 27 ఫలితాల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. శుక్రవారం కరీంనగర్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎన్నికల నోటీస్‌ను జారీచేశాక, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 దాకా నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 12వ తేదీ సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరణ, 13న నామినేషన్ల పరిశీలన, అది పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల నామినేషన్ల ప్రచురణ, 14న సాయంత్రం 5 గంటల దాకా తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకారం, 15న అప్పీళ్ల పరిష్కారం, 16న మధ్యాహ్నం 3 దాకా ఉపసంహరణ, మధ్యాహ్నం 3 తర్వాత అభ్యర్థుల తుదిజాబితా ప్రచురణ ఉంటుంది. 24న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్‌ నిర్వహిస్తారు. అవసరమైతే 25న రీపోలింగ్, 27న ఫలితాలు ప్రకటిస్తారు. 

మరిన్ని వార్తలు