వైద్య కళాశాలలకు హైకోర్టు ఝలక్‌ 

28 Apr, 2019 03:07 IST|Sakshi

యాజమాన్య కోటా ఫీజు పెంపు జీవో రద్దు 

ఫీజు నియంత్రణ కమిటీని సంప్రదించరా? 

డెక్కన్‌ మెడికల్‌ కాలేజీ అడిగితే ఫీజు పెంచేస్తారా? 

సుప్రీంకోర్టు తీర్పును గాలికొదిలేశారు 

తప్పుపట్టిన ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ మైనారిటీ, నాన్‌ మైనారిటీ వైద్య కళాశాలలకు హైకోర్టు గట్టి ఝలక్‌నిచ్చింది. డెక్కన్‌ మెడికల్‌ కాలేజీ అడిగిందే తడువుగా, యాజమాన్యపు కోటా కింద పోస్టు గ్రాడ్యుయేట్‌ సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సుల ఫీజును రూ.5.85 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఓ కాలేజీ అడిగిన వెంటనే ఫీజు నియంత్రణ కమిటీ నివేదిక సమర్పించక ముందే ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినట్లయిందని తెలిపింది. అందువల్ల పీజీ సూపర్‌ స్పెషాలిటీ కోర్సు ఫీజును రూ.5.85 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో 78ను రద్దు చేసింది. పిటిషనర్‌ నుంచి పెంచిన ఫీజును వసూలు చేసి ఉంటే, ఆ మొత్తాన్ని అతనికి నాలుగు వారాల్లో వాపసు చేయాలని సంబంధిత కాలేజీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

ఫీజు నియంత్రణ కమిటీని సంప్రదించలేదు 
పిటిషనర్‌ తరఫున సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫీజులను నిర్ణయించాల్సింది ఫీజు నియంత్రణ కమిటీ అని ఈ కమిటీని సంప్రదించకుండానే ఫీజును రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచేసిందని తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం, డెక్కన్‌ మెడికల్‌ కాలేజీ విజ్ఞప్తి మేరకు ఫీజును రూ.25 లక్షలకు పెంచినట్లు పేర్కొంది. డెక్కన్‌ మెడికల్‌ కాలేజీ నుంచి వినతి రాగానే, దానిపై ఫీజు నియంత్రణ కమిటీకి లేఖ రాశామని తెలిపింది.  

సుప్రీం తీర్పును గాలికొదిలి.. 
ఫీజు నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ప్రభుత్వం ఫీజును రూ.25 లక్షలకు పెంచుతూ జీవో జారీ చేసినట్లు ధర్మాసనం గుర్తించింది. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును గాలికొదిలేసిందని, ఈ ఒక్క కారణంతోనే జీవోను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే డెక్కన్‌ మెడికల్‌ కాలేజీ ఫీజును పెంచడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో యాజమాన్యపు కోటా ఫీజు ఈ స్థాయిలోనే ఉందని తెలిపింది. అయితే దీనితో ధర్మాసనం విభే ధించింది. పొరుగు రాష్ట్రాల్లో ఫీజులు ఎంత ఉన్నాయి.. ఇక్కడ ఎంత ఉన్నాయి.. అన్న అంశాలను పరిశీలించేందుకు తామేమీ ఫీజు నియంత్రణ కమిటీ కాదంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట నిబంధనలకు లోబడి ఉందా? లేదా? అన్నది మాత్రమే చూస్తామని స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా జీవో 78 జారీ చేసే విషయంలో నిబంధనలను అనుసరించలేదని ధర్మాసనం తేల్చింది. అందువల్ల ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.   

అకస్మాత్తుగా ఫీజు పెంచిన సర్కార్‌... 
ప్రకాశం జిల్లా, మార్కాపురంకు చెందిన వై.అనిల్‌రెడ్డి 2018లో నీట్‌ పరీక్ష రాసి, మమతా మెడికల్‌ కాలేజీ యూరాలజీ విభాగంలో సీటు సాధించారు. ఆ వెంటనే అనిల్‌ ఆ కాలేజీలో చేరారు. సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు మొదటి దశ కౌన్సెలింగ్‌ను 2018 ఆగస్టు 1నుంచి 5 వరకు నిర్వహించారు. రెండో దశ కౌన్సెలింగ్‌ను 16నుంచి 19 వరకు నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయ్యే నాటికి ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ మైనారిటీ వైద్య కళాశాలల్లో యాజమాన్యపు కోటా కింద ఫీజు రూ.5.85 లక్షలు (2011లో జారీ చేసిన జీవో 167 ప్రకారం)గా ఉంది. కన్వీనర్‌ కోటా కింద నాన్‌ మైనారిటీ కాలేజీల్లో రూ.3.70 లక్షలుగా, యాజమాన్యపు కోటా కింద రూ.7.50 లక్షలుగా ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తయిన వెంటనే యాజమాన్య కోటా కింద ఫీజులను ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో 78 జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ అనిల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ ధర్మాసనం విచారణ జరిపింది.  

మరిన్ని వార్తలు