కేంద్ర బలగాలా? రాష్ట్ర బలగాలా? 

2 Nov, 2018 03:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భద్ర త వ్యవహారంపై పీటముడి ఏర్పడింది. తనకు అధికార పార్టీతోపాటు పలువురు అధికారుల నుంచి ప్రాణహాని ఉందని, రాష్ట్ర పోలీసులు కాకుండా ఇతర స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బలగాల నుంచి భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి కోరినట్లుగా భద్రత కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారితోపాటు డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం వికారాబాద్‌ ఎస్పీ టీఎస్‌ఎస్‌పీకి చెందిన 4+4 భద్రతను రేవంత్‌రెడ్డి ఇంటికి పంపించారు.

అయితే రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండటంతో భద్రతా సిబ్బంది ఆయన వచ్చే వరకు వేచి ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది రజనీకాంత్‌రెడ్డిని సంప్రదించగా తాము కేంద్ర బలగాలు లేదా రాష్ట్రానికి సంబంధం లేదని స్వతంత్ర విభాగం నుంచి భద్రత కోరామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్ర అధికారులపైనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, ఆ మేరకు న్యాయస్థానం పిటిషనర్‌ రేవంత్‌రెడ్డి కోరినట్లు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు. 

హైకోర్టు ఆదేశాల ప్రకారమే.. 
పోలీస్‌ శాఖ మాత్రం హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము రాష్ట్ర భద్రతను కల్పించేందుకు సిబ్బందిని పంపించామని చెప్పారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సిబ్బందితోనే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి ఆ భద్రతను వద్దనుకుంటే అఫిడవిట్‌ రూపంలో హైకోర్టుకు సమాధానమిస్తామని స్పష్టం చేశారు. అటు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం ఇది కోర్టు« ధిక్కరణ కిందకు వస్తుందని, తాము కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 
     
 

మరిన్ని వార్తలు