కానిస్టేబుల్‌ నియామకాలు మా ఉత్తర్వులకు లోబడి ఉంటాయి

4 Nov, 2018 01:10 IST|Sakshi

 స్పష్టం చేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకాలన్నీ కూడా తాము వెలువరించే తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రశ్నల విషయంలో అనేక అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో కానిస్టేబుల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన, సాధించని అభ్యర్థులందరి ఫలితాలను వెల్లడించాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను సవాలు చేస్తూ 200 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారణ జరిపారు. కొన్ని ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వలేదని, అయినా కూడా మార్కులు ఇచ్చారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు తెలిపారు. కొన్నింటికి కీలో ఇచ్చిన సమాధానాలు తప్పని, తెలుగు అనువాదం కూడా సక్రమంగా లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు