తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా

15 Jun, 2020 14:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లో 25 శాతం కోత విధించడంపై హై కోర్టులో దాఖలయిన పిటిషన్‌ను సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారించింది. పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లో కోత విధించవద్దని పిటీషనర్‌ కోర్టును కోరారు. పూర్తి పెన్షన్‌ను అందించేలా చూడాలన్నారు. పెన్షన్‌ రాజ్యాంగ హక్కని.. దీనిలో కోత విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ..  ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పెన్షన్‌ అంశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో పూర్తి వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణనను ఈ నెల 17కు వాయిదా వేసింది.

వృద్ధాశ్రమాల నిర్వహణ‌పై హై కోర్టు విచారణ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని న్యాయవాది వసుధ నాగరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయని పిటీషనర్‌ కోర్టుకు విన్నవించారు. నిధులు లేని వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్కరి వద్ద నుంచి 60-13 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వృద్ధాశ్రమాల్లో ఉన్నవారిని చూసుకోవడానికి సరిపడా సిబ్బంది లేరని తెలిపారు. పిటీషనర్‌ తరపున వాదనలు విన్న కోర్టు రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల్లో ఏలాంటి పరిస్థితులు ఉన్నాయో నేరుగా వెళ్లి పరిశీలించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. పిటీషనర్‌ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్‌ను సందర్శించాలని తెలిపింది. వాస్తవిక పరిస్థితుల చూసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వృద్ధాశ్రమాల నిర్వహణ కోసం కావాల్సిన నిధులను కార్పోరేట్ కంపెనీలు, ఎన్జీవోల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ(సీఎస్‌ఆర్‌) కింద సమకూర్చుకోవాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వృద్ధాశ్రమాల ఎన్ని.. వాటిలో రిజిస్టర్‌ అయినవి ఎన్ని, కానివి ఎన్ని ఉన్నాయో తెలపాలన్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చైల్డ్, అండ్  ఉమెన్ అధికారులును ఆదేశించించిది. తదుపరి విచారణనను ఈ నెల 23కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు