మున్సిపల్‌ స్టేల రద్దుకు నో

21 Nov, 2019 04:50 IST|Sakshi

ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన హైకోర్టు

78 మున్సిపాలిటీల స్టేలపై కేసుల వారీగా విచారణ షురూ

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. 78 మున్సిపాలిటీలపై సింగిల్‌ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి తోసిపుచ్చారు. మొత్తం 78 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేస్తే రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపల్‌ సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు బుధవారం హైకోర్టును కోరారు. రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, స్టే ఉత్తర్వులు ఉన్న కేసుల్లోని అభ్యంతరాలనే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి తీర్పు చెప్పిందని తెలిపారు.

ఆ అభ్యంతరాలను ధర్మాసనంతోసిపుచ్చింది కాబట్టి స్టేలను రద్దు చేసి ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలని కోరారు. స్టేలున్న కేసులన్నింటినీ కొట్టివేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఈ వాదనలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద జీవో 459 గురించి మాత్రమే విచారణ జరిగిందని, ఆ జీవో వార్డుల పునరి్వభజనకు చెందిన అంశంపైనే ధర్మాసనం న్యాయ సమీక్ష చేసిందన్నారు. తాము జీవో 78ను కూడా సవాల్‌ చేశామని, వార్డుల్లో ఓటర్ల వ్యత్యాసం పది శాతం కంటే ఎక్కువ ఉండటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు వంటి అంశాలపై సింగిల్‌ జడ్జి దగ్గర కేసుల్లో సవాల్‌ చేశామని చెప్పారు.

గుజరాత్‌ స్థానిక సంస్థల కేసులో గడువు ముగిసిన రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్నికలు జరిగాయని న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, మయూరిరెడ్డి, నరేష్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఎన్నికల ముందస్తు ప్రక్రియను సవాల్‌ చేసేందుకు వీల్లేదని, తాము ముందుగానే ఎన్నికల ముందస్తు ప్రక్రియలో చేసిన చట్ట వ్యతిరేక చర్యలపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఒక వార్డుకు మరో వార్డుకు ఓటర్ల సంఖ్య పది శాతం కంటే ఎక్కువ ఉండకూడదని జస్టిస్‌ నవీన్‌రావు తీర్పు చెప్పారని, ఈ విషయాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి ధర్మాసనం అన్నింటిపైనా తీర్పు చెప్పిందనడం సబబుకాదని చెప్పారు. స్టే ఉత్తర్వులున్న కేసులకు ధర్మాసనం తీర్పు వర్తించబోదు కాబట్టి కేసుల వారీగా (73 కేసులనూ) విడివిడిగా విచారణ చేయాల్సిందేనని పేర్కొన్నారు.

స్టేలు ఉన్న అన్ని మున్సిపాలిటీలపై ప్రభుత్వం ఒకే అఫిడవిట్‌ దాఖలు చేయడం చెల్లదని తెలిపారు. ఒక్కో కేసులో ఒక్కో తరహా ఆరోపణలు, అభ్యంతరాలు ఉన్నందున వేటికి వాటికే ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలని చెప్పారు. స్టే ఉత్తర్వులు ఉన్న మున్సిపాలిటీలను మినహాయించి మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని ధర్మాసనం ఎదుట రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిందని, ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా వాదిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కేసుల వారీగా అన్నింటినీ విచారణ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించి ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అన్ని కేసుల విచారణ పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు