ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

10 Mar, 2018 03:00 IST|Sakshi

రుణ విమోచన కమిషన్‌ ఏర్పాటు చేయట్లేదేం?

సాక్షి, హైదరాబాద్‌: రైతులు, వ్యవసాయ కూలీలు తదితరులకు సంబంధించిన రుణ విమోచన కమిషన్‌ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఇప్పటివరకు అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ రాష్ట్ర రుణ విమోచన చట్టం 2016లోని సెక్షన్‌ 3 (1) ప్రకారం రైతులు, వ్యవసాయ కూలీలు తదితరుల కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, 3 నెలల్లో రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతేడాది ఆగస్టు 21న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను ఇప్పటివరకు అమలు చేయలేదంటూ ఇంద్రసేనారెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
 

మరిన్ని వార్తలు