పాల కల్తీపై వివరణ ఇవ్వండి

31 Jan, 2018 03:00 IST|Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

‘సాక్షి కథనం’పై హైకోర్టుకు లేఖ రాసిన నల్లగొండ వాసి

లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాల కల్తీపై వివరణ ఇవ్వాలని  ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం చింది. పశు సంవర్థ్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్‌ మెంట్‌ కోఆపరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ, స్టే ఫుడ్‌ లేబొరేటరీ చీఫ్‌ పబ్లిక్‌ అనలిస్ట్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

‘పాలు కాదు పచ్చి విషం ’శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన కె.నర్సింహారావు లేఖ రూపంలో హైకోర్టు ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. ఆ లేఖను ఆయన పిల్‌ కమిటీకి నివేదించగా, కమిటీలోని మెజారిటీ న్యాయ మూర్తులు సాక్షి కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని సిఫారసు చేశారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించడంతో మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు.   
 

>
మరిన్ని వార్తలు