ఆదివాసులను ఖాళీ చేయించవద్దు 

11 Dec, 2019 03:32 IST|Sakshi

పలు కేసుల్లో ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: అటవీ నివాసుల హక్కుల చట్టంలో నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా అటవీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసులను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం వివిధ కేసుల్లో ఆదేశాలు జారీ చేశారు. కటాఫ్‌ తేదీకి ముందే వారు అడవిలో నివసిస్తున్నారో లేదో నిర్ణయించే పనిని చట్టంలో నిర్దిష్ట అధికారికి అప్పగించాలని ఉందని తెలిపారు. దాని ప్రకారమే చర్యలు తీసుకోవాలని, చట్ట విధానాన్ని పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించవద్దని అటవీ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేడబ్ల్యూ చౌడవరం, కిస్తారాం.. మహబూబాబాద్‌ జిల్లా వెంకటాపురం, మడగూడెం.. కొత్తగూడెం జిల్లా లింగగూడెం, విజయవారిగూడెం ప్రాంతాలకు చెందిన పలువురు ఆదివాసీయులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం విచారించింది.

గిరిజనుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అటవీ నివాసుల చట్ట నిబంధనలకు విరుద్ధంగా అటవీ అధికారులు తమను బలవంతంగా నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, ఆ చట్టం ప్రకారం సంప్రదాయ అటవీ నివాసాల్లో ఉండేలా తమకు హక్కులు ఉన్నాయని తెలిపారు. తమను గిరిజనేతరులుగా ముద్ర వేసి అటవీ ప్రాంతాల నుంచి అన్యాయంగా పంపిస్తున్నారని పిటిషనర్లు వాపోయారు.

అటవీ నివాసుల చట్టం గ్రామసభ అని సూచిస్తుందని, దాని ప్రకారం ఈ ప్రాంత నివాసుల జాబితాను సిద్ధం చేయాలని, ఆ జాబితాను సబ్‌ డివిజనల్‌ స్థాయిలో చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీకి పంపాల్సి ఉంటుందని వారు వాదించారు. కాగా, 2012 నుంచి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఈ ప్రాంతాలకు వలస వచ్చిన వారు ఆక్రమణదారులని, అటవీ చట్టం ప్రకారం వారు ఆదివాసీయులు కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తే స్పందించకుండా హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది. 2005 డిసెంబర్‌ 13 తర్వాత ఈ ప్రాంతాలకు వలస వచ్చిన వారు ఆక్రమణదారులేనని చెప్పింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా