సమర్థత ఉంటేనే స్వీయ వాదనలు

20 Jul, 2018 01:55 IST|Sakshi

‘పార్టీ ఇన్‌ పర్సన్‌’ల కట్టడికి హైకోర్టు కొత్త నిబంధనలు

‘లా’ తెలియని సామాన్యులను సొంత వాదనలకు అనుమతించరాదని నిర్ణయం

న్యాయ పరిజ్ఞానంగల వ్యక్తులూ సామర్థ్యం నిరూపించుకోవాల్సిందే

వారు సమర్థులో కాదో తేల్చనున్న ద్విసభ్య కమిటీ

జడ్జీలతో వాదన, కోర్టు సమయం వృథా అరికట్టేందుకే..

సాక్షి, హైదరాబాద్ ‌: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సహా వివిధ కేసుల్లో కనీస న్యాయ పరిజ్ఞానం లేకుండానే ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’ల పేరిట స్వీయ వాదనలకు దిగుతున్న కక్షిదారుల కట్టడికి హైకోర్టు కొత్త నిబంధనలు విధించింది. సొంతంగా వాదనలు వినిపించుకునే సామర్థ్యం ఉందని నిరూపించుకున్న వ్యక్తులనే ఇకపై ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’లుగా అనుమతిం చాలని నిర్ణయించింది. అలాగే ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’లు కోర్టులో ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఆరోపణలు చేసేందుకు వీల్లేకుండా కఠిన నిబంధనలు రూపొందించింది.

కోర్టులో గౌరవ, మర్యాదలతో నడుచుకుంటానని స్వీయ వాదనలు వినిపించాలనుకునే వ్యక్తుల నుంచి హామీ తీసుకోనుంది. ఒకవేళ వారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవడంతోపాటు నిర్దిష్ట కాలంపాటు ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’లుగా హాజరు కాకుండా నిషేధం విధించనుంది. ఈ మేరకు అప్పిలేట్‌ సైడ్‌ నిబంధనలకు సవరణలు చేసిన హైకోర్టు... అందులో కొత్తగా చాప్టర్‌ 3ఏను చేర్చింది. ఈ నిబంధనలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇటీవల గెజిట్‌లో ప్రచురించాయి.

కఠిన నిబంధనలు ఎందుకంటే...
గత కొన్నేళ్లుగా హైకోర్టులో ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’లు దాఖలు చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. స్వీయ వాదనలు వినిపించే వ్యక్తికి ఇప్పటివరకు ఎటువంటి అర్హతలు నిర్దేశించకపోవడంతో నామమాత్రంగా చదువుకున్న వ్యక్తి సైతం హైకోర్టులో కేసు దాఖలు చేసి (చట్ట నిబంధనలు తెలిసిన వ్యక్తుల సాయంతో) వాదనలు వినిపించే వీలు కలుగుతోంది. దీంతో కనీస న్యాయ పరిజ్ఞానం లేకుండా పత్రికల్లోని కథనాలను ఆధారంగా చేసుకుంటూ పిటిషన్లు వేస్తూ కొందరు సొంతంగా వాదనలు వినిపిస్తున్నారు. అయితే విచారణ సమయంలో న్యాయమూర్తులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతుండటం, న్యాయపరంగా కాకుండా మానవతా దృక్పథంతో ఆదేశాలు జారీ చేయాలని కోరడం పరిపాటిగా మారింది.

దీంతో న్యాయమూర్తులే చట్ట నిబంధనల గురించి వారికి ఎదురు వివరించాల్సి వస్తోంది. మరికొందరు ఏకంగా న్యాయమూర్తులతో వాదనలకు దిగడంతోపాటు భావోద్వేగాలను ప్రదర్శిస్తూ సానుభూతి ఆధారంగా కోర్టు నుంచి ఆదేశాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ న్యాయమూర్తులతో వితండ వాదం చేస్తున్న పరిస్థితులూ ఎదురవుతున్నాయి. దీంతో కోర్టు సమయంతా ఇలాంటి పంచాయితీలకే సరిపోతోందని భావించిన హైకోర్టు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’లపై పలు నిబంధనలు రూపొందించింది.

కొత్త నిబంధనలు ఇవే...
– ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’లుగా వాదించాలనుకునే వ్యక్తి ముందు అందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. అందులో తాను న్యాయవాదిని నియమించుకోకుండా స్వయంగా వాదనలు వినిపించుకోవాలని భావిస్తున్నానో కారణాలను వివరించాలి. – ఆ దరఖాస్తును రాష్ట్ర జుడీషియల్‌ సర్వీసుల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ పరిశీలిస్తుంది. వారిని డెప్యుటేషన్‌పై ప్రధాన న్యాయమూర్తి నామినేట్‌ చేస్తారు.
– దరఖాస్తుదారుడు దాఖలు చేయలనుకుంటున్న కేసుకు సంబంధించిన పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదోనని ద్విసభ్య కమిటీ పరిశీలిస్తుంది.
– కేసులో కోర్టుకు సహాయ సహకారాలు అందించే సమర్థత ఆ వ్యక్తికి ఉందో లేదోననే విషయాన్ని కమిటీ తేల్చి అభిప్రాయాన్ని ఆఫీస్‌ రిపోర్ట్‌ రూపంలో కోర్టుకు తెలియచేస్తుంది.
– స్వీయ వాదనలకు ఆ వ్యక్తి సమర్థుడని కమిటీ తేలిస్తే అప్పుడు వాదనల సమయంలో ఎటువంటి అభ్యంతరకర, అసభ్య పదజాలాన్ని ఉపయోగించబోనని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి.
– ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైతే ఆ వ్యక్తిపై కోర్టు ధిక్కారం కింద చర్యలు, జరిమానా కూడా విధిస్తారు. నిర్ధిష్ట కాలంపాటు ఆ వ్యక్తి ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’గా హాజరు కాకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది.
– ఈ నిబంధనలు తాత్కాలిక బెయిల్, పెరోల్, హెబియస్‌ కార్పస్‌ వంటి కేసులకు వర్తించవు. పైన పేర్కొన్న నిబంధనలతో సంబంధం లేకుండా తమ ముందున్న కేసుల్లోని కక్షిదారుడిని ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’గా అనుమతించే విచక్షణాధికారం సంబంధిత కోర్టుకు ఉంటుంది.

పార్టీ ఇన్‌ పర్సన్‌ అంటే...
న్యాయవాదితో సంబంధం లేకుండా తానే కేసు దాఖలు చేసి కేసును సొంతంగా వాదించుకునే వ్యక్తిని న్యాయ పరిభాషలో పార్టీ ఇన్‌ పర్సన్‌ అంటారు. సాధారణంగా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని వ్యక్తి, న్యాయవాదికన్నా కేసును తానే సమర్థంగా వాదించుకోగలనన్న నమ్మకంగల వ్యక్తి ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’రూపంలో కోర్టు ముందు హాజరవుతారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఎక్కువగా ‘పార్టీ ఇన్‌ పర్సన్‌’లు వాదనలు వినిపిస్తుంటారు. న్యాయవాదులు సైతం తామే పిటిషనర్లుగా ఉంటూ కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదిస్తుంటారు.

మరిన్ని వార్తలు