ట్రాఫిక్‌ సమస్యకు మాస్టర్‌ ప్లాన్‌!

9 Aug, 2018 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వడం లేదని, దీని కోసం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విపిన్‌ శ్రీవాత్సవ్‌ హైకోర్టుకు లేఖ రాశారు. ఏటా రోడ్లపై పెరిగిపోతోన్న వాహనాల సంఖ్యను నియంత్రించేందుకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. లేఖపై స్పందించిన హైకోర్టు దీనిని పిల్‌గా మలిచింది. దీని పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు, పురపాలక ముఖ్య కార్యదర్శి, రవాణా ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు