హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే

6 Dec, 2014 01:40 IST|Sakshi
జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే
  • సోమవారం ప్రమాణం చేయించనున్న సీజే   
  • ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం!
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే చేత సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ప్రమాణం చేయించనున్నారు.

    జస్టిస్ భోస్లే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. బదిలీపై ఉమ్మడి హైకోర్టుకు వస్తున్న జస్టిస్ భోస్లే ఇక్కడ రెండవ స్థానంలో ఉంటారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా త్వరలో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశాలున్నాయి. అనంతరం జస్టిస్ భోస్లే రెండు నెలలు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, తరువాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి.

    ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రాథమికంగా ఓ నిర్ణయం తీసుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందరినీ సులభం గా కలుపుకొనిపోతారని పేరున్న జస్టిస్ భోస్లే.. 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతార జిల్లాలో జన్మిం చారు. ఈయన తండ్రి బాబాసాహెబ్ భోస్లే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతేకాక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. జస్టిస్ భోస్లే కుటుంబీకుల్లో అనేక మంది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవారే. ఆయన విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే సాగింది.

    1979, అక్టోబర్ 11న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసులకు సంబంధించి అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు ముంబై హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆయన ముంబై హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. దేశంలోని రాష్ట్ర న్యాయవాదుల మండళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు జస్టిస్ భోస్లేనే. వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

    ఈ సమయంలోనే ఆయన న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. తరువాత వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం తరఫున ఆయన అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. జస్టిస్ భోస్లే 2001, జనవరి 22న ముంబై హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన నంబర్ 5గా ఉన్నారు. 2018 వరకు ఆయన పదవీ కాలం ఉంది.
     

మరిన్ని వార్తలు