కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ‘హైకోర్టు కోవిడ్‌–19 నిధి’ 

28 Jun, 2020 01:53 IST|Sakshi

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆదుకోవాలని హైకోర్టు నిర్ణయం

న్యాయాధికారులు విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విపత్తును దృష్టిలో పెట్టుకుని హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆదుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. వారి వైద్య ఖర్చుల నిమిత్తం ‘హైకోర్టు కోవిడ్‌–19 నిధి’ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వైద్య ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లించకపోవడంతో హైకోర్టు ఈ నిధి ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో సమావేశమైన న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు ఈ మేరకు తీర్మానం చేసింది.

ఈ నిధికి హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కోర్టుల న్యాయాధికారులు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని ఫుల్‌కోర్టు కోరింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పిటిషన్‌లను ఆన్‌లైన్‌ ద్వారానే దాఖలు చేయాలని న్యాయవాదులను హైకోర్టు కోరింది. లాక్‌డౌన్‌ తొలగించిన తరువాత భౌతికంగా పిటిషన్లు దాఖలు చేయడానికి  అనుమతినిచ్చినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో తిరిగి ఆన్‌లైన్‌ ద్వారానే పిటిషన్లు దాఖలు చేయాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో న్యాయవాదులు, కక్షిదారులకు సూచించారు.

జూలై 20 వరకు కోర్టులకు లాక్‌డౌన్‌
కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో హైకోర్టు, కింది కోర్టుల రోజువారీ కార్యక్రమాల రద్దును జూలై 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో ఫుల్‌ కోర్టు శనివారం సమావేశమై జూలై 20 వరకు అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాలని నిర్ణయించింది. హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రిబ్యునల్స్, లీగల్‌ సర్వీస్‌ అథారిటీ, ఆర్బిట్రేషన్‌ సెంటర్స్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తదితర అన్ని న్యాయ సంస్థల్లో వచ్చే నెల 20 వరకు లాక్‌డౌన్‌ నిబంధనల అమలును పొడిగించాలని సమావేశం తీర్మానించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.   

మరిన్ని వార్తలు