మీ అప్పీళ్లపై 21న విచారణ జరుపుతాం: హైకోర్టు

17 Aug, 2018 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఈ నెల 21న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌రావు విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తేల్చారు. దీంతో జస్టిస్‌ శివశంకర్‌రావు ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు.. గతవారం అప్పీళ్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కోర్టు ధిక్కార కేసులో ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద జస్టిస్‌ శివశంకరరావు.. ఫాం–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు.

అలాగే స్పీకర్, డీజీపీ, నల్లగొండ, జోగుళాంబ గద్వాల్‌ ఎస్పీలకు నోటీçసులిచ్చి ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం ఇరువురు కార్యదర్శుల అప్పీళ్లు కేసుల విచారణ జాబితాలో ఉన్నా అవి విచారణకు నోచుకునే పరిస్థితి లేకపోవడంతో వారి తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్‌కు, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు జారీ చేసిన నోటీసులు, ఇరువురు కార్యదర్శులకు ఇచ్చిన ఫాం–1 నోటీసుల గురించి ధర్మాసనానికి వివరించారు.  

మరిన్ని వార్తలు