పేదలకు రూ.1,500 నగదు సాయం ఆపొద్దు 

14 May, 2020 02:44 IST|Sakshi

వరుసగా 3 సార్లు బియ్యం తీసుకోని వారికీ ఇవ్వాల్సిందే 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

రేషన్‌ కార్డులు లేకున్నా పేదలకు బియ్యం పంపిణీ చేయాలని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా మూడు నెలలు రేషన్‌ బియ్యం తీసుకోని తెల్ల రేషన్‌ కార్డు దారులకు రూ.1,500 నగదు సాయం ఆపేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లాక్‌డౌన్‌ లాంటి కష్టకాలంలో నగదు సాయం ఎలా నిలిపేస్తారని ప్రశ్నించింది. మూడు సార్లు బియ్యం తీసుకున్న వారికే కాకుండా బియ్యం తీసుకోని వారికీ నగదు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వరుసగా 3 నెలలు రేషన్‌ బియ్యం తీసుకోని వారికి రూ.1,500 నగదు సాయం నిలిపివేత అన్యాయమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎ.సృజన రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది.

లాక్‌డౌన్‌ వేళ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తెల్ల రేషన్‌ కార్డు దారులకు నెలకు రూ.1,500 వంతున ఆర్థిక సాయం అందించాల్సిందేనని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. రేషన్‌కార్డుదారులకు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పిన జవాబు పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ ఏడాది మార్చి 20న జారీ చేసిన జీవో 45 ప్రకారం తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ రూ.1,500 వంతున అందజేయాలంది. కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. 

8 లక్షల కార్డుల్నిఎలా  రద్దు చేస్తారు.. 
విచారణ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘రాష్ట్రంలో  8 లక్షల కార్డుల్ని ఒక్కసారిగా ఎలా రద్దు చేస్తారు.. వారికి నోటీసు లేకుండా రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. లాక్‌డౌన్‌ వేళ కార్డు లేదని బియ్యం ఇవ్వకపోయినా, నిత్యావసరాలకు నగదు పంపిణీ చేయకపోయినా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతుంది. ధనవంతులు బాగానే ఉంటారు. పేదరికంలోని వారికే దయనీయ స్థితి. కార్డుదారుల అర్హతలన్నీ చూశాకే తెల్ల కార్డుల్ని జారీ చేసినప్పుడు రద్దు చేసేప్పుడు వారి వివరణ కోరాలి కదా ’అని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ చెబుతున్న స్థాయిలో కార్డులు రద్దు కాలేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం సమయం కావాలని కోరడంతో విచారణను కోర్టు జూన్‌ 2కి వాయిదా పడింది.  

కార్డులు లేకపోయినా ఇవ్వండి 
లాక్‌డౌన్‌ వేళ పేదలకు రేషన్‌ కార్డులున్నా లేకున్నా నెలకు 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని మరో పిల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెల్ల కార్డు చూపిస్తేనే రేషన్‌ ఇస్తామని అధికారులు చెబుతున్నారని, పెద్ద ఎత్తున రద్దు చేసిన కార్డులను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ సామాజిక కార్యకర్త ఎస్‌.క్యూ మసూద్‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి బుధవారం మరోసారి విచారించింది. అటవీ ప్రాంతంలోగానీ, లాక్‌డౌన్‌ అమలు ఉన్న ప్రాంతాల్లోని పేదలు, కూలీలు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి విధిగా బయోమెట్రిక్‌ కింద వేలి ముద్రల కోసం ఒత్తిడి చేయరాదని, అది లేకుండానే నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని  ఆదేశించింది.  

మరిన్ని వార్తలు