వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురు

4 Dec, 2017 12:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో రేపు (మంగళవారం) నాంపల్లి కోర్టుకు విచారణకు రాధాకృష్ణ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన కేసు విచారణకు రాధాకృష్ణతోపాటు ఎడిటర్, పబ్లిషర్, మరికొందరు మంది ఉద్యోగులు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు మండిపడిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు  వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్‌ కె.శ్రీనివాస్, పబ్లిషర్‌ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది. ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఫిర్యాదుపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, మంగళవారం నాటి విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ రాధాకృష్ణ, తదితరులను ఆదేశించింది. వ్యక్తిగత హాజరులో మినహాయింపు కోరుతూ రాధాకృష్ణ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌ను నేడు విచారించిన హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. నాంపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు హైకోర్టు షాక్

మరిన్ని వార్తలు