ఇంటర్‌లో సివిక్స్‌ సబ్జెక్ట్‌ పేరెందుకు మార్చారు?

18 Dec, 2019 01:25 IST|Sakshi

ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ కోర్సు కోసం సవరించిన సిలబస్‌లో ’సివిక్స్‌’సబ్జెక్ట్‌ పేరును ’పొలిటికల్‌ సైన్స్‌’గా మార్పు చేయడాన్ని సవాల్‌ చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకిలా మార్పు చేస్తున్నారో తెలియజేయాలని, పూర్తి వి వరాలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఏపీ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1971 ప్రకారం సివిక్స్‌ సబ్జెక్ట్‌ ప్రవేశపెట్టడం జరిగిందని, దేశవ్యాప్తంగా ప్లస్‌ టు స్థాయి విద్య లో సివిక్స్‌ బోధన జరుగుతోందని, ఎలాంటి అధికారాలు లేకపోయినా ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సివిక్స్‌ సబ్జెక్ట్‌ పేరు మార్పు చేయడం చెల్లదని పేర్కొంటూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్కాలర్స్‌ అసోసియేషన్‌ రిట్‌ దాఖలు చేసింది. ఢిల్లీలోని ఒక విశ్వవిద్యాలయంలో సివిక్స్‌ చదివిన విద్యార్థికి బీఏ పొలిటికల్‌ సైన్స్‌ సీటు రాలేదని చెప్పి ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఇలా ఏకపక్షంగా పేరు మార్పు చేశారని తెలిపారు.  ఇంటర్‌ బోర్డు సెక్రటరీకి ఎలాంటి అధికారం లేదని రిట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు