ఆన్‌లైన్‌ విద్యపై మార్గదర్శకాలకు నో 

28 Jun, 2020 02:42 IST|Sakshi

విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు వ్యాఖ్య

పిల్‌ను కొట్టేసిన ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడంపై ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మార్గదర్శకాలు జారీ చేయడమంటే ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలను, తల్లిదండ్రుల ఇబ్బందులపై ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వం చేయాల్సిన విధాన నిర్ణయాలను కోర్టులు తీసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం పేర్కొంది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు ఫీజులు చెల్లించాలని ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఒత్తిడి చేస్తు న్నాయని, దీనిపై కూడా ప్రభుత్వానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని హైదరాబాద్‌కి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ రహీంఖాన్‌ హైకోర్టును ఆశ్రయించారు.

పశ్చిమబెంగాల్‌లో ఫీజుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఉత్తరాఖండ్‌లో ఫీజులపై మార్గదర్శకాలను జారీ చేసిందని, మన రాష్ట్రానికి సర్క్యులర్‌ జారీ చేయాలని పిటిషనర్‌ న్యాయవాది నిజాముద్దీన్‌ కోరారు. ఆ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఆయా హైకోర్టులు ఉత్తర్వులిచ్చాయని ధర్మాసనం గుర్తుచేసింది. లాక్‌డౌన్‌ లో ఏప్రిల్‌ నుంచి ఫీజుల్ని వసూలు చేయరాదని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, లాక్‌డౌన్‌ రద్దు చేసిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్‌లో ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడి హైకోర్టు జోక్యం చేసుకుందని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు విధాన నిర్ణయంలో భాగమని, ఈ విషయంలో కోర్టు తన పరిధిని దాటి ఉత్తర్వులు ఇవ్వదని వివరించింది.  అందుకే పిల్‌ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. 

నింగీ నేలా వదిలేశారేం..!
పోలీసులు, హోంగార్డులకు పలు వరాలు ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలనే ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నింగీ నేలా అని లేకుండా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో పోలీసులు, హోంగార్డులను నియమించాలని, కరోనా వల్ల చనిపోయిన వాళ్ల కుటుంబసభ్యులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, హోంగార్డులకు బోనస్, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, ఈపీఎఫ్, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది.

అడగటానికి అంతనేది ఒకటి ఉంటుందని, నింగీ నేలను కూడా వదలకుండా కోరుతున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్‌ను న్యాయవాది రాపోలు భాస్కర్‌ దాఖలు చేయగా న్యాయవాది రంగయ్య వాదనలు వినిపిస్తూ, సొంతంగా ఇళ్లు లేని పోలీసులు, హోంగార్డులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పోలీసుల నియామకాలు, వారికి అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలే గానీ తాము కాదని స్పష్టం చేసిన ధర్మాసనం పిల్‌ను తోసిపుచ్చింది. 

>
మరిన్ని వార్తలు