ప్రేమ పెళ్లిళ్లపై కేసులొద్దు

11 Jun, 2017 01:37 IST|Sakshi
ప్రేమ పెళ్లిళ్లపై కేసులొద్దు

మేజర్ల ప్రేమ పెళ్లిళ్లపై ఇరు రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు ఆదేశం  
సాక్షి, హైదరాబాద్‌: కుల, మతాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులపై కేసుల నమోదు విషయంలో ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మేజర్లయిన ప్రేమికులు చేసుకునే పెళ్లిళ్లకు ఆధారాలు ఉంటే వారిపై కేసులు నమోదు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అటువంటి యువతీ, యువకులను పోలీసులు, తల్లిదండ్రులు వేధింపులకు గురి చేయరాదని సూచించింది. ప్రేమ పెళ్లిళ్ల వెనుక ఒత్తిడి, భయం, బెదిరింపు, ప్రలోభం, మత్తు మందు ఇవ్వడం వంటి కారణాలున్నట్లు తేలితేనే కేసులు నమోదు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పోలీసులకు పంపాలని ఉభయ రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ కెయిత్‌ ఇటీవల తీర్పునిచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్న తనపై ...తన భార్య తండ్రి కిడ్నాప్‌ కేసు పెట్టి జైలుకు పంపారని,  తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా గుడిపల్లికి చెందిన ప్రవీణ్‌ అనే యువకుడు వేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు.

పరస్పర ఇష్టంతో పెళ్లి జరిగినా:పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ మేజర్లయిన పిటిషనర్, అతను పెళ్లి చేసుకున్న యువతి పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని ఈ నేపథ్యంలో అతనిపై కేసు నమోదైందన్నారు. పరస్పర అంగీకారంతోనే వివాహం జరిగినట్లు ఆధారాలను పోలీసులకు సమర్పించి నా పిటిషనర్‌ను జైలుకు పంపారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్‌కు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం దేశ యువత ఆలోచనలు విస్తృత పరిధిలో ఉంటున్నాయని, కులమతాంతర, పెళ్లిళ్లు చేసుకోవడానికి వారు వెనుకాడట్లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అందువల్ల యువత వారి దారిలో ముందుకెళ్లేందుకు సహకరించడం తల్లిదండ్రుల బాధ్యతన్నారు.

మరిన్ని వార్తలు