హైకోర్టు ఆదేశిస్తేగానీ స్పందించరా?

21 Jul, 2018 01:28 IST|Sakshi

ఫీజుల విధివిధానాలపై టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ తీరును తప్పుపట్టిన ధర్మాసనం  

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఏఎఫ్‌ఆర్సీ) తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు ఎలా ఉండాలన్న విధివిధానాలపై హైకోర్టు ఆదేశిస్తేగానీ కమిటీ స్పందించదా అని ప్రశ్నించింది. కమిటీ తీరు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. రెండు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల ఖరారు వివాదంపై దాఖలైన వ్యాజ్యాలను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 2016–17 నుంచి 18–19 వరకు మూడేళ్ల విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్‌ విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజు ఏడాదికి రూ.97 వేలుగా కమిటీ సిఫార్సు చేసింది.

ఇలా చేయడాన్ని శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ, వాసవీ ఇంజనీరింగ్‌ కాలేజీలు హైకోర్టులో సవాల్‌ చేశాయి. ఆ కాలేజీల ట్యూషన్‌ ఫీజు రూ.1.37 లక్షలు, రూ.1.60 లక్షలుగా చేయాలని గతంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్‌ ఒక్కరే ఫీజుల్ని నిర్ణయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మిగిలిన కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారని, సమావేశాల మినిట్స్‌ పరిశీలిస్తే డొల్లతనం బట్టబయలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాలపై తీర్పును తర్వాత వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది.

మరిన్ని వార్తలు