ఎల్లుండి వరకు మృతదేహాలను భద్రపరచండి

7 Dec, 2019 04:05 IST|Sakshi

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు ఆదేశం

మహిళ, ప్రజాసంఘాల ఫిర్యాదు పిల్‌గా స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ కేసు నిందితుల మృతదేహాలను ఈనెల 9వ తేదీ రాత్రి 8 గంటల వరకూ భద్రపర్చాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ మహిళా హక్కు లు, ప్రజా సంఘాల ప్రతినిధులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శుక్రవా రం సాయంత్రం ఫిర్యాదు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ సెలవులో ఉన్నందున ఆ ఫిర్యాదును సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు పరిశీలించి, సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణకు స్వీకరించారు. ఆయన నివాసంలో ధర్మాసనం సమావేశమై విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని, వీడియో చిత్రీకరిం చినట్టు ఏజీ చెప్పారు.

వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 9వ తేదీ సోమ వారం రాత్రి 8 గంటల వరకూ మృతదేహాలను భద్రపర్చాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినప్పుడు తీసిన వీడియోను సీడీ లేదా పెన్‌డ్రైవ్‌లో భద్రపర్చి జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి ద్వారా శనివారం సాయంత్రంలోగా హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌కు అందజేయాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యాజ్యాన్ని 9వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు