విచారణ అధికారం సీఈఆర్‌సీకే ఉంది.. 

8 Jan, 2019 01:18 IST|Sakshi

టీఎస్‌ఈఆర్‌సీ, ఏపీఈఆర్‌సీకి ఎలాంటి పరిధి లేదు 

కేసులన్నీ సీఈఆర్‌సీకి బదలాయించండి 

ఏపీఈఆర్‌సీ, టీఎస్‌ఈఆర్‌సీలకు హైకోర్టు ఆదేశం 

మూడేళ్లుగా నలుగుతున్న వివాదానికి తెర 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్‌ పంపిణీ సంస్థలు, విద్యుత్‌ ఉత్పాదన సంస్థల మధ్య నెలకొన్న వివాదాలపై విచారణ జరిపే అధికార పరిధి కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) లేదా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) లేదా తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ)లలో ఎవరికి ఉందన్న అంశంపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. మూడేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు, విద్యుత్‌ ఉత్పాదన సంస్థల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం సీఈఆర్‌సీకే ఉందని తేల్చి చెప్పింది. వివాదాలకు సంబంధించి ఏపీఈఆర్‌సీ, టీఎస్‌ఈఆర్‌సీలు వేర్వేరుగా జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అలాగే సీఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 

ఇదీ వివాదం.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వెలుపల, లోపల ఉన్న పలు విద్యుత్‌ ఉత్పాదన, పంపిణీ సంస్థలు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్‌ఈబీ)తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నాయి. 2006–13 మధ్య కాలంలో ఉత్పాదన, పంపిణీ సంస్థల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజనకు ముందు ఈ వివాదాలపై ఏపీఈఆర్‌సీ విచారణ చేపట్టింది. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో తెలంగాణ టీఎస్‌ఈఆర్‌సీని ఏర్పాటు చేసింది. ఏపీ కూడా పాత ఈఆర్‌సీ స్థానంలో కొత్త ఈఆర్‌సీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పీపీఏ వివాదాలకు సంబంధించిన కేసులను ఎవరు విచారించాలన్న అంశంపై ఏపీఈఆర్‌సీ, టీఎస్‌ఈఆర్‌సీ, విద్యుత్‌ పంపిణీ, ఉత్పాదన సంస్థల మధ్య వివాదం చెలరేగింది. ఇది సీఈఆర్‌సీకి చేరింది. ఈ వివాదంపై విచారణ జరిపే పరిధి తమకే ఉందని సీఈఆర్‌సీ 2015లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఏపీఈఆర్‌సీ, టీఎస్‌ఈఆర్‌సీ జారీ చేసిన పలు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా దాఖలైన మొత్తం 16 పిటిషన్లపై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.

సీఈఆర్‌సీ వాదనే సబబు.. 
‘ఒకే అంశంపై ఏక కాలంలో విచారణ జరిపే పరిధి విద్యుత్‌ నియంత్రణ మండళ్లకు లేదు. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే అంశాలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండళ్ల పరిధిలోకి రావు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విద్యుత్‌ ఉత్పాదన, అమ్మకం ఉమ్మడి పథకమైంది. రాష్ట్ర విభజనకు ముందు ఆ వివాదాలపై ఏపీఈఆర్‌సీకి విచారణాధికారం ఉండేది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నాలుగు విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లు ఏపీకి వెళ్లగా, నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లు తెలంగాణకు వచ్చాయి. దీంతో ఈ వివాదాలన్నీ అంతర్రాష్ట్ర వివాదాలయ్యా యి. కాబట్టి ఈ వివాదాలకు సంబంధించిన ఏపీఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు కావు. టీఎస్‌ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులు కూడా చెల్లుబాటు కావు.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను టీఆఎస్‌ఈఆర్‌సీ రెండు భాగాలుగా విభజించింది. ఒక భాగం వివాదాలను తాను నిర్ణయిస్తే, మరో భాగం వివాదాలను మరో రాష్ట్రం నిర్ణయిస్తుందని భావించింది. ఏపీఈఆర్‌సీ ఏపీ పునర్విభజన చట్టం కింద తనకు మిగిలిన అధికారాలను బట్టి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతోంది. టీఎస్‌ఈఆర్‌సీ వివాదాన్ని రెండు భాగాలుగా విభజించి, ఆ మేర ఉత్తర్వులు జారీ చేసినట్లు వాదిస్తోంది. వాస్తవానికి ఈ రెండూ వాదనలు తప్పు. ఈ మొత్తం వ్యవహారం రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి వాటిపై విచారణ జరిపే అధికార పరిధి తమకే ఉందన్న సీఈఆర్‌సీ వాదనే సరైంది. అందువల్ల ఏపీఈఆర్‌సీ, టీఎస్‌ఈఆర్‌సీలు తమ ముందున్న కేసులన్నింటినీ సీఈఆర్‌సీకి బదలాయించాలి’అని ధర్మాసనం పేర్కొంది.   

మరిన్ని వార్తలు