రైతులకు పరిహారం ఇవ్వరేం?

14 Jul, 2018 02:03 IST|Sakshi

     పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి

     ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రైతుల భూముల్లో విద్యుత్‌ సరఫరా లైన్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు వారికి ఎందుకు పరిహారం ఇవ్వడం లేదో చెప్పాలని హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు, రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు, విద్యుత్‌ నియంత్రణ మండళ్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల భూముల్లో విద్యుత్‌ లైన్లు వేస్తున్న విద్యుత్‌ సంస్థలు ఆ రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్స్‌ (సీఐఎఫ్‌ఎ) ప్రధాన సలహాదారు పి.చంగల్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. అలాగే గత ఏడాది అనంతపురం జిల్లా మడకశిరలో రైతుల భూముల్లో నుంచి విద్యుత్‌ లైన్లు ఏర్పాటుచేసే సందర్భంలో పరిహారం కోసం డిమాండ్‌ చేసిన రైతుల పట్ల కర్ణాటక కాంట్రాక్టర్లు, విద్యుత్‌ అధికారులు దురుసుగా ప్రవర్తించారు.

విద్యుత్‌ లైన్లు పట్టుకున్న రైతులను అలాగే పైకి లాగేయడంతో తండ్రీ, కొడుకులైన రైతులు గాయపడ్డారు. దీనిపై అన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది శేషాద్రి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను కూడా హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించింది. ఈ రెండు వ్యాజ్యాలను శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు