రేవంత్‌ భద్రత విషయంలో మీ వైఖరి ఏమిటి? 

25 Oct, 2018 01:27 IST|Sakshi

కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తనకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, అతని పార్టీకి చెందిన నాయకుల నుంచి ప్రాణహాని ఉందని, ఈ నేపథ్యంలో 4+4 భద్రత కల్పించాలని కోరుతూ ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా ప్రయోజనం లేదని, కాబట్టి తనకు భద్రత కల్పించేలా ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి విచారణ జరిపారు.

భద్రత విషయంలో రేవంత్‌రెడ్డి పెట్టుకున్న వినతిపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది. ఎన్నికల నోటి ఫికేషన్‌ వెలువడిన తరువాత భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు