ధర్నాకు అనుమతిస్తారో లేదో చెప్పండి

27 Apr, 2019 05:51 IST|Sakshi

ఎమ్మార్పీఎస్‌ ధర్నాపై పోలీసులకు హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ 29కి వాయిదా

 సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద మే 7న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) మహాధర్నా నిర్వహించుకోవడానికి అనుమతినిస్తారో లేదో తెలియచేయాలని హైకోర్టు శుక్రవా రం తెలంగాణ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (29కి) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న తాము నిర్వహించతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జస్టిస్‌ షావిలి విచారణ జరిపారు.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతినివ్వడం లేదన్నారు. అనుమతి కోసం తాము పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించారని తెలిపారు. ధర్నా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగే బాధ్యత వహిస్తామంటూ పిటిషనర్‌ను ఈ కోర్టు ముందు అఫిడవిట్‌ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ కోరారు. సంబంధిత అధికారి ముందు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇస్తానని న్యాయమూర్తి చెప్పగా, అధికారి ముందు దాఖలు చేసే అఫిడవిట్‌ అమలుకు నోచుకోదని తెలిపారు.

హామీ ఇచ్చి.. వాటిని ఉల్లంఘిం చిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయని ప్రస్తావించారు. ఎంత మంది ఈ ధర్నాకు హాజరవుతారు.. ఏ కారణంతో ఈ ధర్నా చేస్తున్నారు అన్న వివరాలను పిటిషనర్‌ చెప్పలేదని తెలిపారు. దీనికి హరినాథ్‌రెడ్డి స్పందిస్తూ.. ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల అంబేడ్క ర్‌ విగ్రహం పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చనందుకు నిరసనగా ఈ ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఈ శనివారం నిర్వహించే ధర్నాకు ఇంత తక్కువ వ్యవధిలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేమని శరత్‌ తెలిపారు. అయితే మే 1 లేదా 7న ధర్నా నిర్వహించుకుంటామని, దీనికి అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

మరిన్ని వార్తలు