కాశింను నేడు హాజరుపర్చండి

19 Jan, 2020 05:03 IST|Sakshi

పోలీసులకు హైకోర్టు ఆదేశం

సీజే ఇంటి వద్ద అత్యవసరంగా ధర్మాసనం విచారణ

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చింతకింద కాశీంను ఆదివారం ఉదయం తమ ఎదుట హాజరుపర్చాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కాశీంను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను ధర్మాసనం అత్యవసరంగా విచారించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శనివారం అత్యవసరంగా సీజే నివాసంలో(హౌస్‌మోషన్‌) పిటిషన్‌ను విచారించింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు కాశీంను తమ ఎదుట హాజరు పర్చాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ వాదిస్తూ.. 2016 నాటి కేసులో కాశీం ఇప్పటి వరకూ తప్పించుకు తిరుగు తున్నారని చెప్పిన పోలీసులు శనివారం తెల్లవారుజామున అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని చెప్పారు. భార్య, పిల్లలతో కూడా మాట్లాడేందుకు కూడా ఆయనకు పోలీసులు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. కాశీంను కోర్టులో హాజరుపర్చి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరారు. పోలీసులు చట్ట ప్రకారమే కాశీంను అరెస్ట్‌ చేశారని, ఇప్పటికే కాశీంను గజ్వేల్‌ కోర్టులో హాజరుపర్చి ఉంటారని ప్రభుత్వ న్యాయవాదులు హరేందర్‌ పరిషద్, జె.సాయికృష్ణలు వాదించారు. ఆదేశిస్తే నిందితుడు కాశీంను ధర్మాసనం ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకుని..ఐదేళ్ల నాటి కేసులో నిందితుడు ఇన్నాళ్లూ కాలేజీకి వెళ్లి విద్యాబోధన చేస్తుంటే కనబడటంలేదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఇన్నాళ్లు ఆగి తెల్లవారుజామున అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందని, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు అయ్యాక గజ్వేల్‌ కోర్టులో హాజరుపరుస్తారా? ఇదే మాదిరిగా గతంలో రాజస్థాన్‌లో ఒక కేసులో జరిగితే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని, ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలా.. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ ఆదివారం ఉదయానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు