నెలలోగా ఉద్యోగ  విభజన చేయండి

12 Jun, 2018 02:27 IST|Sakshi

ఉద్యాన వర్సిటీ ఉద్యోగుల కేసులో హైకోర్టు   

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగుల విభజన చేయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం ఏమిటని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు నిలదీసింది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిల ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగుల విభజన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, నెలరోజుల్లోగా ఆయా రాష్ట్రాలకు ఉద్యోగుల తుది కేటాయింపులు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర ఉద్యా న విశ్వవిద్యాలయం, ఏపీలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, రిజిస్ట్రార్‌లకు ఆదేశాలిచ్చింది. తెలంగాణ ఉద్యాన వర్సిటీ నుంచి వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీకి కేటాయింపుల్లో జాప్యాన్ని సవాల్‌ చేస్తూ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మనోహర్‌ ప్రసాద్‌ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది.  వాదనల అనంతరం నెలరోజుల్లోగా ఉద్యోగుల తుది కేటాయింపు పూర్తి చేయాలని ధర్మాసనం రెండు రాష్ట్రాలను ఆదేశించింది.    

>
మరిన్ని వార్తలు