హెల్మెట్లు పెట్టుకోరు.. ఇయర్‌ఫోన్లు తియ్యరు

31 Oct, 2018 02:12 IST|Sakshi

వాహనదారులు, పాదచారుల తీరుపై హైకోర్టు

ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే

ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ :  జంట నగరాల్లో అటు వాహనదారులు.. ఇటు పాదచారులు రోడ్లతో తమకు ఏం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరు హెల్మెట్‌ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతారు. మరొకరు చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ రోడ్లు దాటుతారు. వారికి నిబంధనలతో ఏ మాత్రం పని ఉన్నట్లు కనిపించట్లేదు. ఇంకొందరు అవసరం లేకున్నా హారన్‌లు కొడతారు. వాహనం నడిపేందుకు అర్హత లేని పిల్లలు వేగంగా వాహనాలు నడుపుతున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు.     – హైకోర్టు ధర్మాసనం

జంట నగరాల్లో ట్రాఫిక్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని, ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలేంటి.. వాటిని ఎలా అమలు చేస్తున్నారు.. ఉల్లంఘనులను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అవసరం లేకుండా హారన్‌ కొడుతూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వారిపై తీసుకుంటున్న చర్యలు.. హారన్ల శబ్ద స్థాయిని తగ్గించేందుకు ఏం చేయబోతున్నారు.. వన్‌వే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.. తదితర అంశాల్లో తమకు స్పష్టతనివ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలివ్వట్లేదని, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విపిన్‌ శ్రీవాత్సవ్‌ హైకోర్టుకు లేఖ రాశారు.

అలాగే ఏటా రోడ్లపై వాహనాల సంఖ్య పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాహనదారులు ఇష్టారాజ్యంగా హారన్లు మోగిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, నివాస ప్రాంతాల్లో నో హారన్‌ జోన్లను ఏర్పాటు చేసేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు దీన్ని వ్యాజ్యంగా మలిచింది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రోడ్లు దాటే పరిస్థితి ఏది?
‘జంట నగరాల్లో జీబ్రా లైన్ల వద్ద రోడ్డు దాటేందుకు పాదచారులకు వాహనదారులు అవకాశం ఇవ్వట్లేదు. వాహనదారుల దెబ్బకు పాదచారులు హడలిపోతున్నారు. పాదచారులు కూడా చెవుల్లో ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ రోడ్లు దాటుతున్నారు. పక్క నుంచి, వెనుక నుంచి వచ్చే వాహనాలను పట్టించుకోవట్లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తారు. హెల్మెట్‌ పెట్టుకోరు. ఇక్కడ కూడా అంతే. అయితే ఒకటే తేడా. ఇక్కడ ముగ్గురితో పాటు బరువైన సంచో, బస్తానో ఉంటుంది’అని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందంది.  

తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే చట్టం లేదా?
కొందరు పిల్లలు వాహనం నడిపే అర్హత లేకపోయినా అత్యంత వేగంగా వాహనాలు నడుపుతున్నారని, అలాంటి వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే చట్టం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా అని ధర్మాసనం ఆరా తీసింది. వన్‌వేల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆసుపత్రులు, న్యాయస్థానాలు, నివాస ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లు హారన్లు వినియోగించడంపై కూడా దృష్టి సారించాలని పేర్కొంది.

కాగా, హైదరాబాద్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను విస్తరించట్లేదని, రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యాజ్యాన్ని కూడా విపిన్‌ శ్రీవాత్సవ వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  

మరిన్ని వార్తలు