స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ కేసుల వివరాలివ్వండి

25 Apr, 2019 02:51 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమికస్‌ క్యూరీగా నిరంజన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన స్వైన్‌ప్లూ, డెంగ్యూ కేసుల వివరాలను తమ ముం దుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులు ప్రబలినట్లు గుర్తించిన 117 ప్రాంతాల వివరాలను కూడా సమర్పించాలంది. ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్‌ క్యూరీ)గా సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డిని నియమించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులకు చికిత్స అందించేందుకు సౌకర్యాలు లేవంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టుకు లేఖ రాశారు.

ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం మరో సారి విచారణకు వచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్వైన్‌ఫ్లూ చికిత్స కేవలం గాంధీ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంటే మారుమూల ఉన్న ప్రాంతాల ప్రజల సంగతేమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు