యూనిటెక్‌కు రూ.660 కోట్లు చెల్లించండి 

26 Oct, 2018 01:40 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

నాలుగు వారాల్లో చెల్లించాలి 

ఆ మొత్తాన్ని ఏపీ సర్కారు నుంచి వసూలు చేసుకోండి  

వడ్డీ కూడా చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: యూనిటెక్‌ కంపెనీ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. వేలంలో దక్కించుకున్న భూమికి డబ్బు చెల్లించినా ఆ భూమిని స్వాధీనం చేయడంలో విఫలమైనందుకు అసలు రూ.165 కోట్లకు వడ్డీ రూ.495.55 కోట్లు కలిపి మొత్తం రూ.660.55 కోట్లను యూనిటెక్‌ కంపెనీకి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపులను నాలుగు వారాల్లో పూర్తి చేయాలంది. ఈ మొత్తాన్ని ఏపీ, ఏపీఐఐసీ నుంచి రాబట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇతర చట్ట నిబంధనల కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కోరేందుకు ఈ తీర్పు ఏమాత్రం అడ్డంకి కాదని యూనిటెక్‌ కంపెనీకి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీవల తీర్పునిచ్చారు. 

ఇదీ వివాదం.. 
ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌ మండల పరిధిలో 350 ఎకరాల్లో ఏరోస్పేస్‌ పార్క్‌ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏపీఐఐసీ 2007లో భూమి బహిరంగ వేలం నిర్వహించింది. అప్పటికే ఈ భూమి యాజమాన్యపు హక్కులపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ వేలంలో యూనిటెక్‌  విజేతగా నిలిచింది. నిబంధనల ప్రకారం ఏపీఐఐసీకి రూ.165 కోట్లు చెల్లించింది. న్యాయవివాదం నేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం యూనీటెక్‌కు స్వాధీనం చేయలేదు. ఆ భూమి యాజమాన్యపు హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2011లో హైకోర్టు తీర్పునిచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీఐఐసీ కాస్త టీఎస్‌ఐఐసీగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. సుప్రీం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ  ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హæక్కుల్లేవంటూ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో యూనిటెక్‌ కంపెనీ తాము చెల్లించిన రూ.165 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఎస్‌ఐఐసీని కోరుతూ వచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆ కంపెనీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు తుది విచారణ జరిపి ఈ నెల 23న తీర్పు వెలువరించారు. 

ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. 
యూనిటెక్, టీఎస్‌ఐఐసీల మధ్య వివాదం సాధారణమైందని, అందువల్ల ఆ కంపెనీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలే తప్ప హైకోర్టులో కాదన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాంట్రాక్టు సంబంధిత వివాదాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఒప్పందంలో మధ్యవర్తి క్లాజు ఉందని, అందువల్ల యూనిటెక్‌ కంపెనీ మధ్యవర్తిత్వం వైపు వెళ్లాలే తప్ప పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్న వాదనను కూడా ఆమోదించలేదు. మధ్యవర్తిత్వ క్లాజు ఉన్నంత మాత్రాన బాధిత వ్యక్తి దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత లేకుండా పోదన్నారు. 

అప్పటి వరకు వేచి ఉండాలంటే ఎలా? 
ఈ వివాదం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది కాబట్టి, ఏపీ ప్రభుత్వం కూడా ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉండాలన్న తెలంగాణ న్యాయవాది వాదనతో న్యాయమూర్తి విభేదించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఐఐసీ, టీఎస్‌ఐఐసీ మధ్య ఆస్తి, అప్పుల విభజన గత నాలుగేళ్లుగా పూర్తి కాలేదని, ఎప్పుడు పూర్తవుతుందో కూడా అంచనా వేయడం కష్టమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆస్తి, అప్పుల విభజన పూర్తయ్యేంత వరకు యునీటెక్‌ను వేచి ఉండాలనడం ఎంత మాత్రం సరికాదన్నారు. అనుకున్నట్లు ఏరోస్పేస్‌ ప్రాజెక్టు పూర్తయితే లబ్ధి పొందేది తెలంగాణేనని పేర్కొన్నారు. కాబట్టి యూనిటెక్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి టీఎస్‌ఐఐసీదే బాధ్యత అవుతుందన్నారు. యూనిటెక్‌కు చెల్లించాల్సిన మొత్తం విషయంలో ఏపీకి కూడా బాధ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే, దాన్ని ఆస్తి, అప్పుల విభజన సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి రాబట్టుకోవచ్చని తెలిపారు.  

మరిన్ని వార్తలు